Narendra Modi: సాధ్వీ ప్రాగ్యాను వెనకేసుకొచ్చిన నరేంద్ర మోదీ: 'టైమ్స్ నౌ'కు ప్రత్యేక ఇంటర్వూ!

  • హిందూ నాగరికతపై మచ్చ వేసే నేతలకు ఆమే సమాధానం
  • అమేధీ, రాయ్ బరేలీ అభ్యర్థులు బెయిల్ పై బయటలేరా?
  • సాక్ష్యాలు లేకుండా వ్యక్తులు శిక్షించబడాలా?
  • సిక్కుల ఊచకోతకు కారణమైన వారికి పదవులివ్వలేదా?

మాలేగావ్ పేలుళ్ల నిందితురాలు సాధ్వీ ప్రాగ్యా సింగ్ ఠాకూర్ ను ప్రధాని నరేంద్ర మోదీ సమర్థించారు. ప్రాగ్యాకు పూర్తి మార్కులేసిన ఆయన, హిందూ నాగ‌రిక‌త‌పై ఉగ్ర‌వాదం మ‌చ్చ వేసే నేతలకు ఆమె స‌మాధానంగా నిలుస్తుంద‌న్న నమ్మకం ఉందని అన్నారు.

గడచిన 5 వేల ఏళ్లుగా వసుధైన కుటుంబంలా ఉన్న హిందూ సంస్కృతిని కొందరు ఉగ్రవాదమని వ్యాఖ్యానిస్తున్నారని, కాంగ్రెస్ నేతలు భారీ మూల్యం చెల్లించుకోవాలంటే ప్రాగ్యా సింగ్ వంటి వారుండాలని 'టైమ్స్ నౌ'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. "ఒక మహిళా సాధ్విని అంత క్రూరంగా విమర్శించరాదు" అని ఆయన అన్నారు.

 సంఘౌతా కేసులో తీర్పును గుర్తు చేసుకుంటూ, నిందితులు ఏ సాక్ష్యమూ లేకుండా శిక్షించబడ్డారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 1984లో వేలాది మంది సిక్కులను హత్యలు చేయించిందని, ఆ పార్టీకి విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు. సిక్కుల ఊచకోతకు కారణమైన కాంగ్రెస్ నేతలు ఎంపీలయ్యారని, క్యాబినెట్ మంత్రులుగానూ పనిచేశారని, ఆ పార్టీ ఆరోపణలున్న వ్యక్తిని మధ్యప్రదేశ్ లో సీఎంగా ఎంచుకుందని మోదీ నిప్పులు చెరిగారు.

బెయిల్ పై బయటకు వచ్చిన సాధ్వి ప్రాగ్యకు టికెట్ ఎలా ఇచ్చారని కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను ప్రస్తావించిన ఆయన, అదే బెయిల్ పై బయట తిరుగుతూ రాయ్ బరేలీ, అమేథిల నుంచి పోటీ చేస్తున్న వారిని ఇవే ప్రశ్నలు ఎందుకు అడగటం లేదని ప్రశ్నించారు. "అమేథి, రాయ్ బరేలీలో కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్నవారు బెయిల్ పైనే బయట ఉన్నారు. దీనిపై చర్చ లేదు. అదే భోపాల్ లో మా అభ్యర్థి బెయిల్ పై ఉంటే విమర్శల తుపాను సృష్టిస్తున్నారు. ఇదేం పద్ధతి?" అని ఆయన అన్నారు.

 కాంగ్రెస్ పార్టీ అసత్యాలను ప్రచారం చేస్తోందని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ గురించి తనకు తెలుసునని, జస్టిస్ లోయా సహజ మరణాన్ని హత్యగా సృష్టించిన ఘనత ఆ పార్టీదని అన్నారు. కేసుల్లో దోషిగా నిరూపించబడి జైలు శిక్షను అనుభవిస్తున్న వారి వద్దకు వెళ్లి, కౌగిలించుకునే సంస్కృతి కాంగ్రెస్ దని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి కుంభకోణాన్ని గుర్తు చేస్తూ ప్రధాని విమర్శల వర్షం కురిపించారు.

More Telugu News