జోఫ్రా ఆర్చర్‌కు ప్రపంచకప్‌లో చోటు దక్కకుంటే నగ్నంగా మారిపోతా: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ వాన్ సంచలన ప్రకటన

19-04-2019 Fri 10:05
  • ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించిన ఈసీబీ
  • ఆర్చర్‌కు లభించని చోటు
  • అతడిని ఎంపిక చేసి ప్రపంచాన్ని పెను విపత్తు నుంచి రక్షించాలంటూ యూజర్ కామెంట్
ఇంగ్లండ్ ప్రపంచకప్ జట్టులో జోఫ్రా ఆర్చర్‌కు చోటు లభించకపోతే తాను బట్టలు విప్పేసి నగ్నంగా మారుతానంటూ ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ సంచలన ప్రకటన చేశాడు. ప్రపంచకప్‌లో పాల్గొనే తమ ప్రాథమిక జట్టును బుధవారం ప్రకటించిన ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) 24 ఏళ్ల యువ ఆటగాడు ఆర్చర్‌కు మొండిచేయి చూపింది. అయితే, పాకిస్థాన్‌తో త్వరలో జరగనున్న వన్డే సిరీస్‌కు మాత్రం అతడిని ఎంపిక చేసింది.

ఐపీఎల్ ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్చర్ బౌలింగ్‌లో అదరగొడుతున్నాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే ఆరు వికెట్లు పడగొట్టి అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్నాడు. కాగా, ఇంగ్లండ్ బోర్డు తమ ప్రాథమిక జట్టును ప్రకటించినప్పటికీ, మే 19న ప్రపంచకప్‌లో పాల్గొనే తుది జట్టును ప్రకటించవలసివుంది. అంటే.. పాకిస్థాన్‌తో వన్డే సిరీస్‌ ముగిసిన మరుసటి రోజన్నమాట.

ఆర్చర్‌కు తుది జట్టులో చోటు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన వాన్.. అలా జరగకుంటే మాత్రం తాను నగ్నంగా మారుతానని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ‘‘జోఫ్రా ప్రపంచకప్ ఆడడమో.. నేను నగ్నంగా మారడమో’’ అని ట్వీట్ చేశాడు. వాన్ ట్వీట్‌పై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఓ యూజర్ అయితే.. ‘‘ఈసీబీ ప్లీజ్ జోఫ్రా ఆర్చర్‌ను ఎంపిక చేసి రాబోయే పెను విపత్తు నుంచి ప్రపంచాన్ని కాపాడు’’ అని సరదాగా స్పందించాడు.