Ali: సాయం చేయమంటూ అర్థించిన సౌదీలోని భారతీయుడు.. భరోసా ఇచ్చిన సుష్మా

  • 21 నెలల క్రితం సౌదీకి వెళ్లిన అలీ
  • సాయం కోసం దౌత్య అధికారులను కోరా
  • భారత్‌కు పంపిస్తే మేలు చేసినవారవుతారు

‘ఒక్క విషయం చెప్పండి. నాకు సాయం చేస్తారా? ఆత్మహత్య చేసుకోమంటారా?’ అంటూ విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌‌కు ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. ట్విట్టర్ ద్వారా తన బాధనంతా వెళ్లగక్కాడు. సౌదీ అరేబియాలో ఉంటున్న ఆ వ్యక్తి పేరు అలీ. 21 నెలల క్రితం ఉద్యోగం కోసం భారత్ నుంచి అక్కడకు వెళ్లాడు. అతని వద్ద వీసా పత్రాలు కూడా లేకపోవడంతో తిరిగి రావడం ఇబ్బందికరంగా మారింది.

ఈ నేపథ్యంలో సుష్మకు అలీ ట్వీట్ చేశాడు. ‘ఒక విషయం చెప్పండి. నాకు సాయం చేయగలరా? లేదా నన్ను ఇక్కడే ఆత్మహత్య చేసుకోమంటారా? గత 12 నెలల నుంచి నాకు సాయం చేయాల్సిందిగా భారత దౌత్య అధికారులను అభ్యర్థిస్తున్నాను. నాకు సాయం చేసి భారత్‌కు తిరిగి పంపించినట్లయితే మేలు చేసినవారవుతారు. నాకు నలుగురు పిల్లలు ఉన్నారు’ అని అలీ ట్వీట్‌ చేశాడు.

అలీ చేసిన ట్వీట్‌కు స్పందించిన సుష్మా, ఆత్మహత్య ఆలోచనలు వద్దని వారించారు. మీకు మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. భారత ఎంబసీ మీకు సాయం చేస్తుందని తెలిపారు. అలాగే అలీ ఆత్మహత్య చేసుకుంటానని అనడానికి దారితీసిన కారణాలకు సంబంధించిన పూర్తి నివేదికను సమర్పించాల్సిందిగా రియాద్‌లోని భారత ఎంబసీని సుష్మా ఆదేశించారు.

వెంటనే విచారణ చేపట్టిన ఎంబసీ అలీ ఫోన్ నంబర్‌తో పాటు వీసా పత్రాలను పంపించాలని కోరింది. తన వద్ద ఎలాంటి వీసా పత్రాలు లేవని, సౌదీ ప్రభుత్వం జారీ చేసిన ఇక్‌మా మాత్రమే ఉందని ట్విట్టర్ ద్వారా అధికారులకు తెలిపారు. తాను సౌదీకి వెళ్లి 21 నెలలు అవుతుందని, అప్పటి నుంచి భారత్‌కు తిరిగి వెళ్లలేదని, స్వదేశంలో ఉన్న తన కుటుంబం ఇబ్బందుల్లో ఉందని మరో ట్వీట్‌లో అలీ పేర్కొన్నారు.

More Telugu News