2019 టైమ్స్ ప్రభావశీలుర జాబితాలో ఏకైక భారతీయ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ!

18-04-2019 Thu 12:37
  • 100 మంది ప్రభావశీలుర జాబితా విడుదల
  • ఇండియా నుంచి ముఖేష్ తో పాటు అరుంధతి, మేనక గురుస్వామి
  • ఇతర ప్రముఖుల్లో ట్రంప్, జిన్ పింగ్, మార్క్ జుకర్ బర్గ్ తదితరులు

ప్రపంచవ్యాప్తంగా 100 మంది పేర్లతో అత్యంత ప్రభావశీలురతో 'టైమ్‌' మేగజైన్ జాబితాను ప్రచురించగా, అందులో భారత్ తరఫున ఏకైక భారతీయ పారిశ్రామికవేత్తగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నిలిచారు. ప్రజల జీవితాలను ప్రభావితం చేసే మార్గదర్శకులు, నాయకులు, దిగ్గజాలు, కళాకారులు, వ్యాపారవేత్తలతో కూడిన 2019 జాబితాను 'టైమ్‌' ప్రకటించింది.

ఇంకా ఈ జాబితాలో స్వలింగ సంపర్కుల హక్కుల కోసం పోరాడిన న్యాయవాదులు అరుంధతి కట్జు, మేనక గురుస్వామిల పేర్లు కూడా ఉన్నాయి. భారత మూలాలున్న అమెరికా కమెడియన్‌, హసన్‌ మిన్హాజ్‌ కూ స్థానం లభించింది. 'టైమ్' ప్రభావశీలుర జాబితాలో స్థానం సంపాదించుకున్న ఇతర ప్రముఖుల్లో యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్‌ ట్రంప్‌, పోప్‌ ఫ్రాన్సిస్‌, చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌, పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌, గోల్ఫ్‌ క్రీడాకారుడు టైగర్‌ వుడ్స్‌, ఫేస్‌ బుక్‌ ఫౌండర్ మార్క్‌ జుకర్‌ బర్గ్‌ తదితరులు ఉన్నారు.

కాగా, ఈ వార్త వెల్లడైన తరువాత మహీంద్ర గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర స్పందించారు. ముఖేష్ తండ్రిని మించిన తనయుడని, రిలయన్స్‌ కంపెనీలు ఇప్పుడు ప్రపంచమంతా విస్తరిస్తున్నాయని అన్నారు. ముఖేష్ దార్శనికత ఇప్పుడు దీరూభాయ్ అంబానీని మించిపోయిందని, అతి తక్కువ ధరలకే 4జీ డేటాను అందిస్తూ, 28 కోట్ల మందికి ఆయన దగ్గరయ్యారని ఆనంద్‌ మహీంద్ర ప్రశంసించారు.