Kumaraswami: నిన్న కుమారస్వామి, నేడు నవీన్ పట్నాయక్... ఒడిశా సీఎం హెలికాప్టర్ ను తనిఖీ చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్!

  • మంగళవారం కుమారస్వామి చాపర్ తనిఖీ
  • బుధవారం నవీన్ పట్నాయక్ హెలికాప్టర్ లో సోదాలు
  • ఏమీ దొరకక ఉత్త చేతులతో వెళ్లిపోయిన అధికారులు

48 గంటల వ్యవధిలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్లలో ఎన్నికల అధికారులు దాడులు జరిపారు. మంగళవారం నాడు కర్ణాటక సీఎం కుమారస్వామి చాపర్ లో తనిఖీలు చేసి, ఒట్టి చేతులతో వెళ్లిపోయిన ఫ్లయింగ్ స్క్వాడ్, బుధవారం నాడు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో తనిఖీలు చేసి అందులో ఏమీ డబ్బులు లేవని తేల్చి వెళ్లిపోయారు.

 నిన్న నవీన్ ఎన్నికల ప్రచారం నిమిత్తం రూర్కేలా ప్రాంతానికి వెళ్లగా, చాపర్ దిగగానే, దూసుకొచ్చిన అధికారులు, తనిఖీలకు తమకు సహకరించాలని కోరారు. అందుకు నవీన్ అంగీకరించగానే, హెలికాప్టర్ ను తనిఖీ చేసి అవాక్కయ్యారు. అందులో వారికి ఏమీ దొరకలేదు. చాపర్ ను మొత్తం తనిఖీ చేసేంతవరకూ నవీన్ పట్నాయక్, అక్కడే వేచి చూశారు. దీనిపై వివరణ ఇచ్చిన ఈసీ, ఎవరినైనా తనిఖీ చేసే అధికారం ఈసీ సిబ్బందికి ఉందని స్పష్టం చేశారు.

కాగా, అనపట్టి గ్రామానికి ప్రచారానికి వెళ్లిన కుమారస్వామి లగేజీని కూడా అధికారులు తనిఖీ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, ఒడిశాలోని సంబల్ పూర్ ప్రాంతానికి ప్రచారానికి వెళ్లిన మోదీ చాపర్ ను తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసిన ఆఫీసర్ మహ్మద్ మొహిసిన్ పై ఈసీ సస్పెన్షన్ వేటు వేయడం గమనార్హం. ఎస్పీజీ రక్షణలో ఉండే వారికి తనిఖీల నుంచి మినహాయింపు ఉందని, మొహిసిన్ నిబంధనలను ఉల్లంఘించినట్టేనని ఈసీ స్పష్టం చేయడం గమనార్హం.

More Telugu News