Telangana: తెలంగాణలో అకాలవర్ష బీభత్సం.. ఐదుగురి మృతి

  • రాష్ట్రవ్యాప్తంగా 62 చోట్ల వర్షాలు
  • ఈదురుగాలులు, పిడుగులతో బీభత్సం
  • మరో నాలుగు రోజులు వర్షాలే

అకాల వర్షం ఐదుగురి ప్రాణాలు తీసింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బుధవారం కురిసిన వర్షానికి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు పిడుగుపాటుకు గురై మృతి చెందగా, మరొకరు గోడకూలి మృతి చెందారు. రాష్ట్రంలోని 62 ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.  

నల్గొండ జిల్లా గుండాల మండలం బండకొత్తపల్లిలో తాటిచెట్టుపై పిడుగు పడడంతో గీతకార్మికుడు సత్తయ్య గౌడ్ (30) మృతి చెందాడు. వర్షం పడుతుండడంతో ధాన్యం కుప్పలపై పట్టాలు కప్పేందుకు వెళ్లిన కురుమర్తికి చెందిన చెన్నబోయిన రాణి (30), కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం బొమ్మకల్‌కు చెందిన రైతు చిలువేరి సమ్మయ్య (55), పెద్దపల్లి జిల్లా మూలసాలలో గొర్రెల కాపరి అజయ్‌ పిడుగుపాటుకు గురై మృతి చెందారు. సుల్తానాబాద్‌ మండలం సుద్దాలలో గాలివానకు గోడకూలి భాగ్యమ్మ అనే మహిళ మృతిచెందింది.

కాగా, బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతంలో హిందూ మహాసముద్రాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా నేటి నుంచి మరో నాలుగు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

More Telugu News