Sanjhi Virasith: తనను గెలిపిస్తే 'సగం ధరకే మద్యం, ఒక్కొక్కరికీ ఒక్కో మేక' ఇస్తానంటున్న ఢిల్లీ అభ్యర్థి!

  • వంద హామీలతో కూడిన పోస్టర్లు
  • ఉచితంగా రేషన్
  • ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల రద్దు
  • ఆడపిల్ల పుట్టగానే రూ.50వేల డిపాజిట్

ఎన్నికల్లో మేనిఫెస్టో కీలక పాత్ర వహిస్తాయి. అందులో ఇచ్చిన హామీలు ఎంతవరకూ నెరవేరుస్తారన్నది తరువాత సంగతి కానీ, హామీలు మాత్రం ఆకర్షణీయంగా, ఆకట్టుకునేలా ఉంటే చాలా వరకూ ఓటర్లను ప్రభావితం చేయడం ఖాయం. అయితే కొన్ని హామీలు చాలా విచిత్రంగా ఉంటాయి. అలాంటి మేనిఫెస్టోల్లో ఢిల్లీకి చెందిన సాంఝీ విరాసత్‌ పార్టీ మేనిఫెస్టో కూడా ఒకటి. ఆ పార్టీకి చెందిన ఈశాన్య ఢిల్లీ అభ్యర్థి అమిత్ శర్మ వంద హామీలతో కూడిన పోస్టర్లను తయారు చేయించారు.

వాటిలో ముఖ్యమైన హామీ సగం ధరకే మద్యం విక్రయం. మరికొన్ని ముఖ్యమైన హామీలు: మహిళలకు కావల్సినంత బంగారం, ప్రతి ముస్లింకు రంజాన్ పండుగ కానుకగా ఒక మేక, ఉచితంగా రేషన్, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల రద్దు, విద్యార్థులకు ఉచితంగా మెట్రో లేదా బస్ పాసులు, ఆడపిల్ల పుట్టగానే రూ.50వేల డిపాజిట్, ఆడపిల్ల వివాహానికి రూ.2.50 లక్షల ఆర్థిక సాయం, యువకులకు ఉచితంగా క్రీడా పరికరాలు, ల్యాప్‌టాప్‌లు, అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.10 లక్షల వరకూ ఉచిత వైద్యం, నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.10వేలు ఇస్తామని ప్రకటించారు. మరి అమిత్ గెలిస్తే వీటిని ఎంత వరకూ నెరవేరుస్తారో కానీ, హామీలు మాత్రం భారీగా ఉన్నాయి.

More Telugu News