raj thakre: బీజీపీకి అంత ధైర్యమే వుంటే రాజ్ థాకరే ఇంట్లో సోదాలు చేయాలి: ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్

  • గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చిన రాజ్ థాకరే 
  • ఈ సారి ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా ప్రచారం
  •  ఆయన ర్యాలీలను అడ్డుకునే ప్రయత్నాల్లో బీజేపీ      

ఎన్నికల సమయంలో ఆయా పార్టీలకి చెందిన వ్యక్తులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం .. మాటల యుద్ధాలకి దిగడం .. ఒకరి తీరును ఒకరు దుయ్యబట్టడం సహజంగానే జరుగుతూ ఉంటుంది. అదే దృశ్యం ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీకి .. ఎన్సీపీకి మధ్య కనిపిస్తోంది. రాజ్ థాకరే ర్యాలీల ఖర్చు విషయాన్ని బీజేపీ తెరపైకి తీసుకురావడంతో, 'లెక్కలు అడగడం కాదు .. దమ్ముంటే ఆయన ఇంట్లో సోదాలు చేయాలి' అంటూ ఎన్సీపీ సవాలు విసిరింది.

ఎమ్ఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే .. ఎన్సీపీ పొత్తులో భాగంగా, తన పార్టీ నుంచి ఒక్క అభ్యర్థిని కూడా లోక్ సభ ఎన్నికల బరిలోకి దింపలేదు. ఎన్సీపీ గెలుపు కోసం ఆయన నాందేడ్ .. కొల్హాపూర్ .. సోలాపూర్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తూ వెళుతున్నారు. సతారా .. బారామతి నియోజక వర్గాల్లో ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలోనే .. రాజ్ థాకరే ర్యాలీల కోసం అవుతోన్న ఖర్చును ఎవరు భరిస్తున్నారో తెలియజేయాలంటూ ఎన్నికల కమీషన్ కి బీజేపీ ఒక లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ స్పందిస్తూ  .. "గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి రాజ్ థాకరే మద్దతు పలికారు. కానీ ఇప్పుడు ఆయన బీజేపీ పార్టీని ఓడించడమే లక్ష్యంగా .. మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. అందువల్లనే ఆయన ర్యాలీలపై బీజేపీ లెక్కలు అడుగుతోంది. అసలు బీజేపీకి అంత ధైర్యమే వుంటే ఆయన ఇంట్లో సోదాలు చేయాలి" అంటూ ఛాలెంజ్ చేశారు. 

More Telugu News