Andhra Pradesh: చంద్రబాబు నిధులు ఇస్తే మీరు ఆపేస్తారా?... బ్యాంకుకు తాళం వేసిన అనంతపురం జిల్లా రైతులు!

  • కల్యాణదుర్గం మండలం ముద్దినేనిపల్లిలో ఘటన
  • అన్నదాత సుఖీభవ, రుణమాఫీ నిధుల విడుదలలో జాప్యం
  • ఆగ్రహంతో బ్యాంకును ముట్టడించిన రైతులు

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఈరోజు రైతులు రెచ్చిపోయారు. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ, రుణమాఫీ కింద మంజూరు చేసిన నిధులను బ్యాంకులు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా బ్యాంకుకు తాళం వేసి నిరసన తెలియజేశారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రైతులను శాంతింపజేశారు.

జిల్లాలోని కల్యాణదుర్గం మండలం ముద్దినేనిపల్లి రైతులకు ఇటీవల అన్నదాత సుఖీభవ, రుణమాఫీ నిధులు బ్యాంకు ఖాతాల్లో జమ అయినట్లు ఫోన్లకు సందేశాలు వచ్చాయి. అయితే ఈ నిధులను విత్ డ్రా చేసుకునేందుకు ముద్దినేనిపల్లి సహకార బ్యాంకుకు వెళ్లిన రైతులకు చుక్కెదురైంది. బ్యాంకులో నగదు లేదనీ, రాగానే ఇస్తామని అధికారులు తిప్పించుకోవడం మొదలుపెట్టారు.

చివరికి సహనం నశించిన రైతులు ఈరోజు ముద్దినేనిపల్లి సహకార బ్యాంకును ముట్టడించారు. అధికారులందరినీ బయటకు రప్పించి తాళం వేసేశారు. ఈ సందర్భంగా ‘ఏపీ సీఎం చంద్రబాబు నిధులు విడుదల చేస్తే ఇవ్వడానికి మీకు ఇబ్బంది ఏంటి?’ అని రైతులు బ్యాంకు అధికారులను నిలదీశారు. పాత అప్పులకు ఈ నిధులను జమ చేసుకునేందుకు బ్యాంకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. రైతులను శాంతింపజేశారు. బ్యాంకు అధికారులతో మాట్లాడి నిధులు త్వరగా విడుదల అయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో మెత్తబడ్డ రైతులు అక్కడి నుంచి వెనుదిరిగారు.

More Telugu News