Balaghat: ప్రచారానికి 75 లక్షలిస్తారా? కిడ్నీలు అమ్ముకోవాలా? ఈసీకి ఎంపీ అభ్యర్థి లేఖ!

  • బాలాఘాట్ నుంచి పోటీ పడుతున్న కిశోర్ సమ్మిట్
  • గతంలో సమాజ్ వాదీ ఎమ్మెల్యేగా ఉన్న నేత
  • స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి
  • ఖర్చు చేసేందుకు డబ్బు లేదని వాపోయిన నేత

తనకు పోటీగా ఉన్న ప్రత్యర్థులంతా కోటీశ్వరులేనని, వారితో పోటీ పడి డబ్బు ఖర్చు పెడుతూ తాను ప్రచారం చేసుకోలేనని, తనకు రూ. 75 లక్షలు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ను కోరాడో అభ్యర్థి. గతంలో సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసిన కిశోర్ సమ్మిట్ అనే వ్యక్తి, ప్రస్తుతం మధ్యప్రదేశ్, బాలాఘాట్ లోక్ సభకు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. తన వద్ద డబ్బులు లేవని చెబుతున్న అతను, కిడ్నీలు అమ్ముకుని ప్రచారం చేసుకునేందుకు తాను సిద్ధమని, అందుకైనా అంగీకరించాలని కోరుతూ ఈసీకి లేఖ రాశారు.

ఎన్నికల ప్రచారానికి మరో 15 రోజులు మాత్రమే గడువుందని ప్రస్తావిస్తూ, తాను రూ. 75 లక్షలు ఖర్చు చేయవచ్చని నియమావళి చెబుతున్నందున ఆ డబ్బు ఇప్పించాలని, బ్యాంకుల నుంచైనా రుణం ఇప్పించాలని, లేకుంటే కిడ్నీలు విక్రయించుకునేందుకు అనుమతించాలని కోరారు. తాను రాసిన లేఖను మీడియాకు విడుదల చేసిన సందర్భంగా మాట్లాడిన ఆయన, డబ్బులు ఉన్నవారే పోటీలో ఉన్నారని, ఈసీ నియమాలు కూడా అలాగే ఉన్నాయని, ప్రస్తుత నిబంధనలను మార్చాలని డిమాండ్ చేశారు. డబ్బు ఖర్చు పెట్టేందుకు అనుమతి ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఈ చట్టాల ప్రకారం సామాన్యులు పోటీ చేసే అవకాశం లేదన్నారు.

More Telugu News