Tamilnadu: తాతయ్య పుట్టిన రోజు నాటికి నాన్నే సీఎం!: ఉదయనిధి స్టాలిన్

  • తమిళనాట నేటితో ముగియనున్న ప్రచారం
  • 22 మంది అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించండి
  • స్టాలిన్ కుమారుడు ఉదయనిధి సుడిగాలి ప్రచారం

తన తాతయ్య కరుణానిధి జయంతి రోజున తన తండ్రి స్టాలిన్ సీఎం కావడం ఖాయమని తమిళ నటుడు, స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరిగే లోక్ సభ ఎన్నికలకు నేటితో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించారు. అరక్కోణం, తిరుత్తణి ప్రాంతాల్లో రోడ్ షో చేపట్టిన ఉదయనిధి, అన్నాడీఎంకే, పీఎంకే పార్టీలు ఎన్నికల వేళ కలిసిపోయాయని ఆరోపించారు. అన్నాడీఎంకే ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయిందని, అధికారంలోకి రానున్నది డీఎంకేయేనని జోస్యం చెప్పారు. మార్పు కోసం ప్రజలు సిద్ధంగా ఉండాలని సూచించారు.

ప్రజలు అన్నాడీఎంకేను బహిష్కరించే రోజులు త్వరలోనే రానున్నాయని, మోదీ ప్రధాని అయిన తరువాత అభివృద్ధిలో ఇండియా 25 ఏళ్లు వెనుకబడిపోయిందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. నల్లధనాన్ని వెలికితీసి ప్రతి కుటుంబానికీ నేరుగా అందిస్తానన్న మోదీ, ఆ పని చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని అన్నారు.

డీఎంకే అధికారంలోకి వస్తే, నీట్ ను రద్దు చేసి, పేద విద్యార్థులు సైతం వైద్య విద్యను అభ్యసించేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రజలంతా డీఎంకేను ఆదరిస్తే, ఉప ఎన్నికలు జరిగే 22 నియోజకవర్గాల్లో డీఎంకే అభ్యర్థులు విజయం సాధిస్తారని, జూన్ 3న కరుణానిధి జయంతి వేడుకల నాడు స్టాలిన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు.

More Telugu News