Maneka Gandhi: ఏబీసీడీ అంటూ గ్రేడింగ్... మరోసారి మేనకా గాంధీ సంచలన వ్యాఖ్యలు

  • 'ఏ' కేటగిరీలో తమకు బాగా ఓట్లేసిన గ్రామాలు
  • ఓట్లు తక్కువగా వేసిన గ్రామాలు డి కేటగిరీలో!
  • కేటగిరీని బట్టే అభివృద్ధి చేస్తానంటూ వ్యాఖ్యలు

కేంద్ర మంత్రి మేనకా గాంధీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమకు గంపగుత్తగా ఓట్లేసే గ్రామాలను 'ఏ' కేటగిరీలో చేర్చుతామని, తద్వారా వారికి మరిన్ని ప్రయోజనాలు కలిగేలా చేస్తామని అన్నారు. తమకు చాలా తక్కువ సంఖ్యలో ఓట్లు వేసిన గ్రామాలను 'డి' కేటగిరీలో చేర్చి ఆ ప్రకారమే వారి పట్ల వ్యవహరిస్తామని తమ వైఖరి స్పష్టం చేశారు.

తమకు మద్దతుగా 80 శాతం ఓటింగ్ నమోదు చేసిన గ్రామాలను 'ఏ' కేటగిరీలో, 60 శాతం నమోదు చేసిన గ్రామాలను 'బి' కేటగిరీలో, 50 శాతం నమోదుచేసిన గ్రామాలను 'సి' కేటగిరీలో చేర్చుతామని చెప్పారు. అంతకంటే చాలా తక్కువగా ఓట్లేసిన గ్రామాలు 'డి' కేటగిరీలో ఉంటాయని హెచ్చరిక ధోరణిలో చెప్పారు.

తన కుమారుడు వరుణ్ గాంధీ పోటీచేస్తున్న ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ నియోజకవర్గంలో మేనకా గాంధీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పిలిభిత్ లో విజయం తమకు కొత్త కాదని, ఈసారి గ్రామాలను ఏ,బీ,సీ,డీ కేటగిరీలుగా విభజించి అభివృద్ధి చేస్తామని అన్నారు. బాగా ఓట్లేసి 'ఏ' కేటగిరీలోకి వచ్చిన గ్రామాలను మరింత బాగా అభివృద్ధి చేస్తామని, మరి ఏ కేటగిరీలో ఉంటారో తేల్చుకోవాల్సింది ప్రజలేనని తెలిపారు.

కాగా, 'డి' కేటగిరీలో ఉండాలని ఎవరూ కోరుకోరు కదా అంటూ పరోక్షంగా ఓటర్లను హెచ్చరించినట్టు మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇటీవలే మేనకా గాంధీ సుల్తాన్ పూర్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లను ఉద్దేశించి, తనకు ఓటు వేసినవాళ్లే తన వద్దకు వచ్చి ఉపాధి చూపించమని అడగాలని స్పష్టం చేశారు. తనకు ఓటు వేయకుండా ఎవరైనా ముస్లిం తన వద్దకు వస్తే వారిని పట్టించుకోనని, ప్రతిఫలం కోరకుండా పనిచేసుకుంటూ పోవడానికి మనమేమన్నా గాంధీజీ బిడ్డలమా! అంటూ వ్యాఖ్యానించారు.

More Telugu News