lakshmi parvathi: నా పరువు, మర్యాదను కాపాడండి: తెలంగాణ డీజీపీకి లక్ష్మీపార్వతి ఫిర్యాదు

  • కోటిపై ఫిర్యాదు చేసిన లక్ష్మీపార్వతి
  • తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఫిర్యాదు
  • చర్యలు తీసుకుని, న్యాయం చేయాలంటూ విన్నపం

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి కలిశారు. కోటి అనే యువకుడితో పాటు మరికొందరు తనను టార్గెట్ చేసి... తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. కోటిని బిడ్డగా భావించానని... తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని చెప్పారు. తన పరువు, మర్యాదలను కాపాడాలని కోరారు. వీరిపై చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలని విన్నవించారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, తన పరువుకు భంగం కలిగించేలా కోటి వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. టీవీ ఛానల్స్, సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని మండిపడ్డారు. తనకు న్యాయం చేయాలని డీజీపీని కోరానని... దీని వెనక ఉన్న కుట్రను ఛేదించాలని విన్నవించానని చెప్పారు. తన ఫిర్యాదుపై డీజీపీ వెంటనే స్పందించారని... వెంటనే హైదరాబాద్ కమిషనర్ తో మాట్లాడారని తెలిపారు. హైదరాబాద్ కమిషనర్ ను కూడా తాను కలుస్తానని చెప్పారు.

లక్ష్మీపార్వతి తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ కోటి అనే యువకుడు గుంటూరు జిల్లా వినుకొండ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వాట్సాప్ లో తనకు సందేశాలను పంపడమే కాకుండా, కొన్ని నీలి చిత్రాలను కూడా పంపారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అంశం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది.

More Telugu News