Andhra Pradesh: ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నేత మేరుగ నాగార్జున.. బెదిరింపులు వస్తున్నాయని వ్యాఖ్య!

  • నా భద్రతను 2 ప్లస్ 2కు పెంచండి
  • టీడీపీ నేతలపై చర్యలు తీసుకోండి
  • ఫిర్యాదులో ఈసీని కోరిన వైసీపీ నేత

గుంటూరు జిల్లాలోని వేమూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మేరుగ నాగార్జునపై పోలింగ్ సందర్భంగా టీడీపీ శ్రేణులు దాడిచేసినట్లు వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో మేరుగ నాగార్జున ఈరోజు ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీని కలుసుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి నక్కా ఆనంద బాబు, ఆయన అనుచరులపై కేసులు పెట్టాలని కోరినట్లు తెలిపారు. అలాగే కొల్లూరులో కనకదుర్గ అనే ఎస్టీ మహిళపై ఎం.మురళీకృష్ణ అనే టీడీపీ కార్యకర్త దాడిచేసి దూషించాడనీ, బాధితురాలు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు పెట్టలేదన్నారు.

అలాగే భట్టిప్రోలు మండలం పెసర్ల లంక గ్రామంలో వైసీపీ నేత వెన్నం సురేష్ పై పొలం సాకుగా చూపుతూ దాడిచేస్తే నిందితులను అరెస్ట్ చేయలేదన్నారు. వీరిందరిపై ఎస్సీ,ఎస్టీ కేసులు పెట్టి అరెస్ట్ చేసేలా డీజీపీని ఆదేశించాలని ఈసీని కోరామన్నారు.

ఎన్నికలవేళ వైసీపీ శ్రేణులకే కాకుండా తనకు కూడా బెదిరింపులు వస్తున్నాయని మేరుగ నాగార్జున తెలిపారు. తనపై ప్రతిచర్యలు ఉంటాయని ఆయా నేతలు నేరుగా పత్రికల్లోనే ప్రకటిస్తున్నారని అన్నారు. అందుకే తక్షణం తనకు, తమ క్యేడర్ కు రక్షణ పెంచాలని కోరారు.

అలాగే ప్రస్తుతం తనకు ఉన్న 1 ప్లస్ 1 సెక్యూరిటీని 2 ప్లస్ 2కు పెంచాలని కోరారు. తనను వేమూరులో పర్యటించవద్దని కోరిన జిల్లా ఎస్పీ, మంత్రి నక్కా తిరుగుతుంటే మాత్రం మౌనంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ తాను నియోజకవర్గంలోకి వెళ్లి ఉంటే గొడవలు అయ్యేవని స్పష్టం చేశారు.

More Telugu News