Andhra Pradesh: ఏపీలో టీడీపీకి 110-140 సీట్లు.. సర్వేలన్నీ ఇదే చెబుతున్నాయి!: సీఎం చంద్రబాబు

  • టీడీపీ గెలుపు వెయ్యి శాతం తథ్యం
  • ప్రజాస్వామ్యం కోసమే టీడీపీ పోరాటం
  • పార్టీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలవబోతోందని ప్రతీ సర్వే చెబుతోందని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 110 నుంచి 140 సీట్ల వరకూ టీడీపీ దక్కించుకుంటుందన్న అభిప్రాయం సర్వత్ర ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో టీడీపీ గెలుపు 1000 శాతం తథ్యమని పునరుద్ఘాటించారు. అమరావతిలో టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులతో చంద్రబాబు ఈరోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికే టీడీపీ పోరాటం చేస్తోందని చంద్రబాబు తెలిపారు. వైసీపీ అరాచకాలను, బీజేపీ తప్పుడు పనులను ప్రజల్లో ఎండగట్టామని వ్యాఖ్యానించారు. ఎన్నికల వేళ టీడీపీపై ప్రతీరోజూ దాడులు జరిగాయనీ, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని అన్నారు. ఏపీలో దాదాపు 8 లక్షల ఓట్లను తొలగించేందుకు కుట్రలు చేశారని చంద్రబాబు ఆరోపించారు.

అయితే సకాలంలో స్పందించి వాటిని భగ్నం చేయగలిగామని చెప్పారు. ఉదయం ఓట్లు వేయకుండా వెనక్కి వెళ్లిపోయిన వారు కూడా తన పిలుపుతో మళ్లీ వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారని సీఎం గుర్తుచేశారు. అసలు 50 శాతం వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను లెక్కించడానికి ఈసీకి ఉన్న అభ్యంతరం ఏంటని టీడీపీ అధినేత ప్రశ్నించారు.

More Telugu News