Crime News: యశ్వంత్‌పూర్‌ నుంచి ఢిల్లీకి వెళ్లే సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుల దోపిడీ

  • కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చిన దుండగులు
  • డబ్బు, నగలు, సెల్‌ఫోన్‌లు చోరీ
  • ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మత్తులోనే ప్రయాణికులు

పరిచయస్తుల్లా నటించి ప్రయాణికులతో మత్తుమందు కలిపిన కూల్‌ డ్రింక్‌ తాగించారు. వారు అపస్మారక స్థితిలోకి వెళ్లగానే విలువైన వస్తువులు, నగదు, సెల్‌ఫోన్‌లు ఎత్తుకు పోయారు. యశ్వంత్‌పూర్‌కు వెళ్లే సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో శనివారం అర్ధరాత్రి తర్వాత ధర్మవరం రైల్వేస్టేషన్‌ దాటాక ఈ ఘటన చోటు చేసుకుంది.

 రైల్వే పోలీసుల కథనం మేరకు... బెంగళూరు నుంచి బయలుదేరిన సంపర్క్ ‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ జనరల్‌ బోగీలో కర్ణాటక రాష్ట్రం శ్రావణబెలగొళకు చెందిన నితిన్‌జైన్‌ (37), బెంగళూరుకు చెందిన రాహుల్‌ (28), బీహార్‌కు చెందిన ప్రేమ్‌శంకర్‌ (20), ఉత్తరప్రదేశ్‌కు చెందిన టింక్‌ (28), సూర్యకాంత్‌ (24), అబ్బాస్‌ఖాన్‌ (21) ప్రయాణిస్తున్నారు. తోటి ప్రయాణికుల్లా నటించిన కొందరు వీరితో మాటలు కలిపారు. అనంతరం మత్తుమందు కలిపిన బిస్కెట్లు, శీతలపానీయాలు ఇచ్చారు. దీంతో వీరంతా తీవ్రమైన మత్తులోకి జారుకున్నారు.

అదే అదనుగా వారి వద్ద వున్న విలువైన వస్తువులు దొంగిలించి తర్వాత స్టేషన్‌లో దిగిపోయారు. రాత్రి పడుకున్న వీరు ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలైనా లేవకపోవడంతో అనుమానం వచ్చిన తోటి ప్రయాణికులు కాజీపేటలో రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. వారు పరిశీలించి అనుమానంతో స్థానిక ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

ఇందులో నలుగురు కోలుకోగా, సూర్యకాంత్‌, నితిన్‌ జైన్‌ ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమయానికి కూడా ఇంకా మత్తులోనే ఉన్నారు. వీరి నుంచి ఆరు ఫోన్‌లు, ఒక బంగారు ఉంగరం, రూ.10వేల నగదు, పర్సు, ఇతర వస్తువులు ఎత్తుకు వెళ్లినట్లు ప్రాథమికంగా నిర్థారించారు. బాధితుల కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.

  • Loading...

More Telugu News