Vontimitta: ఒంటిమిట్టలో గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని... ప్రత్యేక ఏర్పాట్లు!

  • గత సంవత్సరం భారీ వర్షం
  • కుప్పకూలిన టెంట్లతో భక్తుల ఇబ్బందులు
  • జర్మన్ షెడ్లను తెప్పించిన అధికారులు

కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామాలయంలో గత సంవత్సరం కల్యాణోత్సవం వేళ, కురిసిన భారీ వర్షం, పందిళ్లు నేలమట్టమై, ప్రజలు ఇబ్బందులు పడ్డ ఘటనలను, ఏర్పాట్లపై వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని, ఈ సంవత్సరం మరింత పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంత వర్షం వచ్చినా చెక్కుచెదరని జర్మన్ షెడ్లతో కల్యాణ వేదికను సిద్ధం చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నేటి నుంచి కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా, 18న రాత్రిపూట కల్యాణోత్సవం జరుగుతుంది.

కల్యాణోత్సవానికి దాదాపు లక్ష మంది వరకూ భక్తులు వస్తారని అంచనా వేస్తున్న అధికారులు, ఎవరికీ కష్టం కలుగకుండా చూడాలని భావిస్తున్నారు. 2 లక్షల ముత్యాల తలంబ్రాలను సిద్ధం చేసిన టీటీడీ, వాటిని ఆలయానికి అందివ్వనుంది. గత సంవత్సరం ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం ఒంటిమిట్ట ప్రాంతంలో కురిసిన సంగతి తెలిసిందే. పిల్లలతో కలసి వచ్చిన భక్తులు, వర్షంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటువంటి ఘటనలు ఈ ఏడాది పునరావృతం కాకుండా చూస్తామని అధికారులు వెల్లడించారు. కల్యాణ వేదికను సైతం మరింత పటిష్ఠంగా నిర్మిస్తున్నట్టు తెలిపారు.

More Telugu News