Andhra Pradesh: అధికారంలోకి రాగానే చంద్రబాబు అక్రమాలు, అవినీతిపై కేసులు నమోదుచేస్తాం!: వైసీపీ నేత అమర్నాథ్

  • ఈసీపై చంద్రబాబు రంకెలు వేస్తున్నారు
  • మాల్యా, నీరవ్ లాలా బాబు విదేశాలకు పారిపోతారు
  • రేపు ప్రజలను కూడా బాబు తప్పుపడతారు

ఏపీ సీఎం చంద్రబాబు గత ఐదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే ఒక్క పనిని కూడా చేయలేదని వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఈరోజు చంద్రబాబు ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)పై రంకెలు వేస్తున్నాడని దుయ్యబట్టారు. చంద్రబాబు చర్యలకు పచ్చ మీడియా వంతపాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చచొక్కాలు వేసుకున్న వ్యక్తులను తీసుకొచ్చి చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తుంటే ఓ స్వతంత్ర సంస్థగా ఈసీ ఆయన చర్యలను అడ్డుకుందన్నారు. విశాఖపట్నంలోని వైసీపీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో అమర్నాథ్ మాట్లాడారు.

జగన్ అధికారంలోకి రాగానే ఏపీని, దేశాన్ని విడిచిపెట్టి పారిపోయే మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబేనని గుడివాడ అమర్నాథ్ జోస్యం చెప్పారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీలా విదేశాలకు పారిపోయి..‘ఇండియాకు, నాకు సంబంధం లేదు’ అని చంద్రబాబు చెబుతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి, అక్రమాలను ప్రజల ముందు పెట్టి, ఆయనపై కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు.

గత ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రేపు ఓడిపోయినందుకు ప్రజలను తప్పుపట్టినా ఆశ్చర్యపోనక్కరలేదని అన్నారు. ‘ప్రజలంతా పోలింగ్ స్టేషన్ లో టీడీపీకి ఓటేసేందుకు వెళ్లారు. కానీ పైన సీలింగ్ కు ఫ్యాన్ ను చూసి వైసీపీకే ఓటేశారు అని చెప్పినా చెబుతారు’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

More Telugu News