Andhra Pradesh: చంద్రబాబు వ్యూహాలు అర్థం కాక టీడీపీ నేతలు భయపడుతున్నారు.. ప్రజాతీర్పు అనూహ్యంగా ఉండబోతోంది!: నటుడు శివాజీ

  • బీజేపీ కొత్త డ్రామాను మొదలుపెట్టింది
  • జగన్, కేసీఆర్ లకు 33 సీట్లు వస్తాయని పీఏఆర్సీ సర్వే చెప్పింది
  • వైసీపీ కావాలనే ఇంటర్నల్ వీడియోలు విడుదల చేస్తోంది
ఎట్టకేలకు చిన్నచిన్న అల్లర్లు, దౌర్జన్యాలు, హత్యలతో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయని నటుడు శివాజీ తెలిపారు. ప్రజల్లో ఉన్న ఐక్యత కారణంగా ఎన్నికలు చాలావరకూ ప్రశాంతంగా ముగిశాయని వ్యాఖ్యానించారు. తాజాగా బీజేపీ ఇప్పుడు కొత్త డ్రామాను మొదలుపెట్టిందని ఆరోపించారు.

‘పీఏఆర్సీ అనే పేపర్ ను తయారుచేసి, వాళ్లదో గవర్నమెంటు స్టాంపులాగా ఓ స్టాంపు వేసి ఇదే రాజముద్ర అన్నట్లు ఎన్డీయేకు 39, ఫెడరల్ ఫ్రంట్ కు 33 సీట్లు వస్తున్నాయని చూపించారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే కేసీఆర్ కు 16, జగన్ మోహన్ రెడ్డికి 17 సీట్లు.. మొత్తం కలిపి 33 సీట్లు వస్తాయని చెబుతున్నారని తెలిపారు.

అయితే, ఇందుకు భిన్నంగా ఏపీలో ప్రజలు ఒకవైపే ఉన్నారనీ, మే 23న ప్రజాతీర్పుతో ప్రజాప్రభుత్వం ఏర్పడబోతోందని శివాజీ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఓడిపోతున్నాడు కాబట్టే ఫ్రస్ట్రేషన్ తో ఉన్నారని చెప్పేందుకు వైసీపీ ఇంటర్నల్ వీడియోలను విడుదల చేసిందని ఆరోపించారు. చంద్రబాబు వ్యూహాన్ని టీడీపీ నేతలు అర్థం చేసుకోలేక భయపడుతున్నారన్నారు.

‘ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. 23న ప్రజా ప్రభుత్వం ఏర్పడబోతోంది. తీర్పు అనూహ్యంగా ఉండబోతోంది. బెట్టింగులు, అంచనాలు కేవలం టైంపాస్ కు మాత్రమే. ప్రజలంతా వన్ సైడ్ గా ఉన్నారు. ఎంజాయ్’ అంటూ వీడియోను ముగించారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
Jagan
YSRCP
BJP
sivaji

More Telugu News