IT: ఐటీ గ్రిడ్ వ్యవహారంపై హైదరాబాద్ ‘ఆధార్’ రీజనల్ అధికారి ఫిర్యాదు

  • యూఐడీఏఐ ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు
  • మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అధికారి
  • ఈ కేసు సిట్ అధికారులకు బదలాయింపు

ఐటీ గ్రిడ్ సంస్థ వ్యవహారంపై హైదరాబాద్ ఆధార్ రీజనల్ కేంద్ర కార్యాలయం అధికారి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.మాదాపూర్ పోలీసులు ఈ కేసును సిట్ అధికారులకు బదలాయించారు. ఆధార్ యాక్ట్ 2016 సెక్షన్ 37,38.40,42,44 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 2019 మార్చి వరకు ఈ సెక్షన్ల కింద కేవలం రెండేళ్ల శిక్ష మాత్రమే ఉండేదని, ఆ తర్వాత ఈ చట్టంలో చేసిన సవరణల వల్ల ఈ శిక్ష పదేళ్లకు పెంచినట్టు సంబంధిత అధికారుల సమాచారం.

కాగా, ఐటీ గ్రిడ్ సంస్థలో దొరికిన ఆధార్ డేటాపై ఢిల్లీలోని యూఐడీఏఐ కార్యాలయానికి సిట్ అధికారులు  ఇటీవలే ఓ లేఖ రాశారు. ఈ లేఖలో అనేక అంశాలను గుర్తించిన అధికారులు ఆశ్చర్యపోయినట్టు సమాచారం. ఆధార్ కేంద్ర కార్యాలయం, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన ప్రజల వ్యక్తిగత, కీలక సమాచారం ఎలా బయటకు వచ్చిందని అధికారులు నిర్ఘాంతపోయినట్టు తెలిసింది. హైదరాబాద్ లోని ఆధార్ రీజనల్ ఆఫీసు ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయాలని యూఐడీఏఐ ఆదేశించిందని, ఈ మేరకు సంబంధిత అధికారి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని సమాచారం.

ఇదిలా ఉండగా, సిట్ విచారణలో భాగంగా గతంలోనే ఆధార్, ఎలక్షన్ కమిషన్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆధార్ నుంచి పోలీసులకు తాజాగా మరో ఫిర్యాదు అందడం గమనార్హం.

More Telugu News