Chandrababu: ​గెలిచేది నేనే అని చెప్పుకుంటూ ఎందుకింత కంగారు పడుతున్నారు?: చంద్రబాబుకు అంబటి సూటి ప్రశ్న

  • మీరు గెలుస్తుంటే ఎవరూ అడ్డుపడరు
  • కానీ అర్థంలేని మాటలు ఎందుకు?
  • 23వ తేదీ తర్వాత ఏం జరుగుతుందో ప్రజలే నిర్ణయిస్తారు

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తనకేదో గందరగోళం జరిగిపోతోందని భ్రమిస్తున్నారంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. పరిశీలనగా గమనిస్తే చంద్రబాబు "నేను మునిగిపోతున్నాను" అని తానే చెప్పుకుంటున్నాడని విమర్శించారు. ఓవైపు తానే గెలుస్తానంటూ చెప్పుకుంటూ మరోవైపు ఎవరో ఏదో చేశారంటూ కంగారుపడుతున్నారని ఎద్దేవా చేశారు.

"పసుపు-కుంకుమ పథకంతో మహిళల్లో విశ్వాసం చూరగొన్నానని, వాళ్లు తనకు పెద్ద ఎత్తున ఓట్లేశారని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. మీరు గెలుస్తుంటే ఎవరూ అడ్డుపడరు, కానీ ఈ విమర్శలు, ఆరోపణలు, అర్థంలేని మాటలు ఎందుకు? ఎందుకింత కంగారు పడుతున్నారు?" అంటూ ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యంలో ప్రజలపై విశ్వాసం ఉంటే తప్పులేదని, అయితే తన చుట్టూ ఏదో కుట్ర జరిగిపోతోందని ఇష్టంవచ్చినట్టు మాట్లాడడం సరికాదని అన్నారు. విలేకరులు అడిగితే 23వ తేదీ తర్వాత మంచి ముహూర్తం చేసుకుని ప్రమాణస్వీకారం చేస్తున్నట్టు చెప్పారని, ముహూర్తం చూసుకుంటే మంచిదేనని, కానీ ఆ రోజున ఆయన ప్రమాణస్వీకారం చేస్తారో, ప్రమాణస్వీకారం చేయరో ప్రజలు నిర్ణయిస్తారని అంబటి వ్యాఖ్యానించారు. ఏదేమైనా చంద్రబాబునాయుడు గారికి 23వ తేదీ తర్వాత మంచి ముహూర్తం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యంగ్య ధోరణిలో చెప్పారు.

More Telugu News