sumalatha: సుమలత విషయంలో మరోమారు నోరుజారిన సీఎం కుమారస్వామి

  • 16న సుమలత తలకు కట్టుతో కనిపిస్తారు
  • తన కార్యకర్తలతోనే రాళ్లతో కొట్టించుకుంటారు
  • యువత సైన్యంలో చేరుతున్నది పొట్ట నింపుకోవడం కోసమే
ప్రముఖ సినీ నటి, మాండ్యా స్వతంత్ర అభ్యర్థి సుమలతపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మరోమారు నోరు జారారు. బుధ,గురువారాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. బుధవారం మాండ్యాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సీఎం మాట్లాడుతూ.. ఈ నెల 16న సుమలత ఓ కొత్త నాటకానికి తెరతీయబోతున్నారని పేర్కొన్నారు. ఆ రోజున ఆమె తలకు కట్టుతో కనిపిస్తారని జోస్యం చెప్పారు. తన కార్యకర్తలతోనే రాళ్లతో కొట్టించుకుని, తలకు కట్టుకట్టుకుని సానుభూతితో ఓట్లు పొందాలని ప్రణాళికలు సిద్ధం చేశారని కుమారస్వామి ఆరోపించారు.

గురువారం మాండ్యా జిల్లాలోనే మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యువత సైన్యంలో చేరుతున్నది దేశభక్తితో కాదని, రెండు పూటలా తిండికోసమేనని పేర్కొన్నారు. కడుపు నింపుకునేందుకు సైన్యంలో చేరుతున్న వారి జీవితాలతో ప్రధాని మోదీ చెలగాటం ఆడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కుమారస్వామి వ్యాఖ్యలను బీజేపీ తప్పుబట్టింది. యువత సైన్యంలో చేరుతున్నది దేశభక్తితోనేనని స్పష్టం చేసింది. ఇక, తాను కట్టుతో కనిపించబోతున్నానంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై నటి సుమలత స్పందించారు. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే తనపై దాడికి కుట్ర పన్నినట్టు అనుమానంగా ఉందన్నారు. తేదీ, సమయాన్ని కూడా కచ్చితంగా చెప్పడం చూస్తుంటే దాడికి పథక రచన జరిగే ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.
sumalatha
Karnataka
kumaraswamy
Elections

More Telugu News