Telugudesam: ఈవీఎంల విషయంలో ఈసీ ఫెయిల్: గల్లా జయదేవ్

  • సకాలంలో ఏర్పాట్లు చేయలేకపోయారు
  • చివరిదాకా అధికారులను, పోలీసులను బదిలీ చేస్తూనే ఉన్నారు
  • 200కి పైగా ఈవీఎంలు లోపభూయిష్టం

టీడీపీ నేత, గుంటూరు పార్లమెంటు స్థానం అభ్యర్థి గల్లా జయదేవ్ ఎన్నికల సంఘం పనితీరుపై ట్విట్టర్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు. ఇవాళ పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించిన ఘటనలపై ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. ఈవీఎంల పనితీరు భేషుగ్గా ఉంటుందని భరోసా ఇవ్వడంలో ఎన్నికల సంఘం విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో 200కి పైగా ఈవీఎంలు మొరాయించడమో, వాటిని మార్చాల్సి రావడమో జరిగిందని, ఈ కారణంగా 3 గంటల సమయం వృథా అయిందని ఆరోపించారు.

ఎన్నికల సంఘం ఈవీఎంల పనితీరు గురించి పట్టించుకోకుండా చివరి నిమిషం వరకు అధికారులను, పోలీసులను బదిలీ చేస్తూ ఎంతో బిజీగా ఉందంటూ గల్లా వ్యంగ్యం ప్రదర్శించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పలువురు జిల్లా ఎస్పీలను, ఇంటెలిజెన్స్ డీజీ, సీఎస్ లను బదిలీ చేసిన నేపథ్యంలో గల్లా ఈ వ్యాఖ్యలు చేసినట్టు అర్థమవుతోంది.

More Telugu News