Andhra Pradesh: దేశవ్యాప్తంగా 11 గంటల వరకూ 24.32 శాతం ఓటింగ్... ఏపీలో మాత్రం 15 శాతమే!

  • ఉత్సాహంగా సాగుతున్న పోలింగ్
  • కొన్ని చోట్ల రెండు గంటలు ఆలస్యంగా మొదలు
  • ఆరింటి వరకూ లైన్లో ఉన్న అందరికీ ఓటేసే చాన్స్
  • ఏపీ సీఈసీ గోపాలకృష్ణ ద్వివేది

ఈ ఉదయం నుంచి దేశవ్యాప్తంగా తొలిదశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కాగా, ఏపీ మినహా మిగతా ప్రాంతాల్లో ఓట్లు వేసేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. ఉదయం 11 గంటల వరకూ దేశవ్యాప్తంగా సగటున 24.32 శాతం పోలింగ్ నమోదుకాగా, ఏపీలో మాత్రం 15 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో రెండు గంటల పాటు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం కావడంతో పోలింగ్ శాతం తక్కువగా కనిపిస్తోందని సీఈసీ గోపాలకృష్ణ ద్వివేది వ్యాఖ్యానించారు.

ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభమైన ప్రాంతాల్లో పోలింగ్ సమయాన్ని పెంచే అవకాశాలు లేవని, అయితే, సాయంత్రం 6 గంటల వరకూ క్యూ లైన్లో ఉన్న అందరూ ఓటేసేందుకు అవకాశం కల్పిస్తామని, అందరూ ఓటు వేసి వెళ్లేంతవరకూ రాత్రి 9 గంటలైనా పోలింగ్ కొనసాగుతుందని ద్వివేది స్పష్టం చేశారు.

వివిధ మీడియా సంస్థల్లో వస్తున్నట్టుగా 30 శాతం ఈవీఎంలు మొరాయించాయనడం అవాస్తవమని స్పష్టం చేశారు. తమ దృష్టికి వచ్చిన అన్ని సమస్యలనూ పరిష్కరించామని, మరో 24 చోట్ల సమస్యలను పరిష్కరించేందుకు ఇంజినీర్లను పంపామని అన్నారు. మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, ఈవీఎంలపై రాజకీయ నాయకులు చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని అన్నారు. 

More Telugu News