Elections: ఈవీఎంలపై ప్రజలకు విశ్వాసం లేదనడం కరెక్టు కాదు: ప్రొఫెసర్ నాగేశ్వర్

  • అలాంటి ఉద్దేశం ప్రజలకు ఉంటే ఓటు వేసే వారే కాదు
  • ఎన్నికల సంఘం వైఖరి వల్లే సమస్య వస్తోంది
  • ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమైన పని

దేశ వ్యాప్తంగా రేపు ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఈవీఎంలపై తమకు అనుమానాలు ఉన్నాయంటూ ప్రతిపక్షాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ, ఈవీఎంలపై ప్రజలకు విశ్వాసం లేదనడం కరెక్టు కాదని, అలాంటి ఉద్దేశం ప్రజలకు ఉంటే అసలు ఓటు వేసే వారే కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు ఓట్లు వేస్తున్నారు కనుక ఈ ఓటింగ్ ప్రక్రియపైనా, ఓటింగ్ యంత్రాల పైన నమ్మకం ఉన్నట్లే అని అన్నారు. ఈవీఎంలకు సంబంధించి ఎన్నికల సంఘం వైఖరి వల్లే సమస్య వస్తోందని అన్నారు.

అసలు, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయగలమా? లేదా? ఈవీఎంలు ఉపయోగిస్తున్న సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈవీఎంలలో ఓట్లు పడ్డ తర్వాత  ఏంటి? అనే ముఖ్యమైన మూడు విషయాలను ఆలోచించాలని సూచించారు. అధిక సంఖ్యలో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడమన్నది అసాధ్యమైన పని అని, టెక్నికల్ గా సాధ్యమయ్యే పని కాదని నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు.

ఈవీఎంలను మొత్తానికి మొత్తం ట్యాంపరింగ్ చేయడానికి సంబంధించి సైంటిఫిక్ గా ఎలాంటి ఆధారాలు దొరకలేదని, అలా అని చెప్పి, ట్యాంపరింగ్ కావట్లేదన్న నిర్ణయానికి రాలేమని అన్నారు. ఈరోజున ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని అయినా ట్యాంపరింగ్ చేయలేకపోవచ్చు కానీ, భవిష్యత్ లో అసాధ్యం అని చెప్పడానికి వీల్లేదని అన్నారు. ఏ టెక్నాలజీ అయినా ట్యాంపరింగ్ కు అతీతమన్న నిర్ణయాన్ని మనం ఇవ్వలేమని చెప్పారు.

More Telugu News