Twitter: ట్విట్టర్ లో గంభీర్-మెహబూబా ముఫ్తీ యుద్ధం.. గంభీర్ ను బ్లాక్ చేసిన మాజీ సీఎం!

  • ఆర్టికల్ 370పై తలెత్తిన వివాదం
  • తమపై నిషేధం విధించాలన్న పిల్ పై స్పందించిన మెహబూబా
  • ఆమె వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బీజేపీ నేత గంభీర్

జమ్మూకశ్మీర్ కు ప్రత్యేకహోదాను కల్పిస్తున్న భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370పై రాజకీయ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. భారత్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీలు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని ఇటీవల ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. దీనిపై పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ- బీజేపీ నేత, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ల మధ్య ట్విట్టర్ లో తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడిచింది.

ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిల్ పై మెహబూబా స్పందిస్తూ..‘కోర్టులో సమయాన్ని వృథా చేయడం ఎందుకు? బీజేపీ అధికారంలోకి వచ్చేదాకా ఆగండి. ఆర్టికల్ 370ని రద్దుచేసేస్తారు. అప్పుడు మాలో ఎవ్వరూ ఎన్నికల్లో పోటీచేయరు. ఎందుకంటే భారత రాజ్యాంగం ఇక్కడ చెల్లదు కాబట్టి.  ఓ భారతీయులారా? ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతే మీరు తుడిచిపెట్టుకుపోతారు. మీ కథలు చరిత్ర కనపడవు’ అని ట్వీట్ చేశారు.

దీంతో వెంటనే రంగంలోకి దిగిన గౌతమ్ గంభీర్..‘ఇది భారత్.. తుడిచిపెట్టుకునిపోవడానికి నీలాగా ఓ మరక కాదు’ అని దుయ్యబట్టారు. దీనికి మెహబూబా ఘాటుగానే స్పందించారు. ‘బీజేపీలో మీ రాజకీయ జీవితం మీ క్రికెట్ కెరీర్ లా ముగిసిపోకూడదని కోరుకుంటున్నా’ అని చురకలు అంటించారు. గంభీర్ ప్రతిస్పందిస్తూ.. ‘ఓ.. నా ట్విట్టర్ హ్యాండిల్ ను అన్ బ్లాక్ చేశారా? నేను చేసే ఒక్క ట్వీట్ కు జవాబు ఇవ్వాలంటే మీకు 10 గంటలు పడుతుంది. ఇది మీ వ్యక్తిత్వ లోపంగానే భావిస్తున్నా. చిన్నచిన్న సమస్యలను కూడా మీరు ఇన్నాళ్లూ పరిష్కరించుకోలేకపోయారంటే నాకు ఆశ్చర్యం ఏమీ కలగడం లేదు’ అని విమర్శించారు.

అయితే వెనక్కి తగ్గని మెహబూబా..‘‘నేను మీ మానసిక ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నా. ట్రోలింగ్ నాకు అలవాటే. కానీ ఇలాంటి వాగ్వాదాలు మంచివికావు. కశ్మీర్ గురించి మీకు ఏమీ తెలియనప్పుడు వాదించకుండా మౌనంగా ఉండిపోవడమే మంచిది. ఇదిగో అందుకోసమే మీ ట్వీట్టర్ హ్యాండిల్ ను బ్లాక్ చేస్తున్నా. మీ ‘రెండు రూపాయలకు ఓ ట్వీట్ ట్రోలింగ్’ ను ఇంకెక్కడైనా చేసుకోండి’’ అని తలంటారు. దీంతో గంభీర్ స్పందిస్తూ..‘థాంక్యూ మెహబూబా జీ.. నన్ను బ్లాక్ చేశారు సరే. ప్రస్తుతం భారత్ లో 1,365,386,456 మంది ఉన్నారు. వీరందరిని ఎలా బ్లాక్ చేస్తారు’ అంటూ ట్వీట్ల యుద్ధాన్ని ముగించారు.

  • Loading...

More Telugu News