Edla Srinu: 20 ఏళ్లుగా పోలీసులకు సవాలుగా మారిన ‘తెలంగాణ వీరప్పన్’ అరెస్ట్

  • డ్రోన్ కెమెరా సాయంతో కలపను గుర్తించి, స్వాధీనం
  • విలోచవరంలో కాపుగాసి పట్టుకున్న పోలీసులు
  • అధికారుల గురించి ప్రభుత్వానికి నివేదిక

కొంతకాలంగా తప్పించుకుని తిరుగుతున్న కరుడుగట్టిన కలప స్మగ్లర్, తెలంగాణ వీరప్పన్‌గా పిలిచే ఎడ్ల శ్రీను అలియాస్ పోతారం శ్రీనును నేడు పోలీసులు అరెస్ట్ చేశారు. గత 20 ఏళ్లుగా కలప అక్రమ రవాణా చేస్తూ అటవీశాఖాధికారులతో పాటు పోలీసులకు సవాలుగా మారాడు.

ఈ క్రమంలో రామగుండం కమిషనరేట్ పోలీసులు శ్రీనుతో పాటు అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ఎడ్ల శ్రీను రెండు నెలలుగా విజయవాడ, విశాఖ, అన్నవరం, భద్రాచలం ప్రాంతాల్లో తల దాచుకున్నట్టు పోలీసులు తెలిపారు. శ్రీను కోసం గాలింపు చేపట్టిన పోలీసులు కొద్ది రోజుల క్రితం అక్రమ కలప డంపును డ్రోన్ కెమెరా సాయంతో గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు.

తన కలప డంపులను పోలీసుల కంట పడకుండా చేసేందుకు మంథని మండలం విలోచవరం గ్రామానికి చేరుకున్న శ్రీనును పోలీసులు కాపుగాసి అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ, 1999లో ఫర్టిలైజర్స్ వ్యాపారం చేసిన శ్రీను అందులో నష్టాలు రావడంతో ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలిపారు.

ఎడ్ల శ్రీనుకు వరంగల్, ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ‘తెలంగాణ వీరప్పన్‌’గా పేరున్నట్టు తెలిపారు. అతనికి సహకరించిన రాజకీయ పార్టీల నేతలు, పోలీసు, అటవీశాఖ అధికారుల గురించి ప్రభుత్వానికి నివేదిక అందించినట్టు సత్యనారాయణ తెలిపారు. ఈ కేసులో ఎడ్ల శ్రీనుతోపాటు వడ్ల సంతోష్, మధుకర్, కిషన్, శ్రీనివాస్‌లను అరెస్ట్ చేసినట్టు తెలిపారు.

More Telugu News