Telangana: టీఆర్ఎస్ ‘కారు’ నాలుగు టైర్లలో ఒకటి పంక్చర్ అయింది.. హరీశ్ పరిస్థితి అంతలా దిగజారిపోయింది!: బీజేపీ నేత రఘునందనరావు

  • అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్ కే మెజారిటీ ఎక్కువ
  • స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆయన పేరే లేదు
  • మెదక్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేత

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ లో హరీశ్ రావుకే అత్యధిక మెజారిటీ వచ్చిందనీ, ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారని బీజేపీ నేత రఘునందనరావు ప్రశ్నించారు. హరీశ్ రావు పేరును కనీసం స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చలేదనీ, తనలాంటి కొందరు దీనిపై మాట్లాడితేనే పేరు పెట్టారని వ్యాఖ్యానించారు. హరీశ్ రావు పరిస్థితి అంత దారుణంగా దిగజారిపోయిందన్నారు. టీఆర్ఎస్ నాలుగు టైర్లలో ఒకటి పంక్చర్ అయిందని ఎద్దేవా చేశారు. మెదక్ లోక్ సభ అభ్యర్థిగా పోటీచేస్తున్న రఘునందనరావు ఈరోజు ప్రచారంలో భాగంగా ఓ మీడియా ఛానల్ తో మాట్లాడారు.

తనను గెలిపిస్తే మెదక్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకటేనని ప్రజలు భావిస్తున్నారని ఆయన అన్నారు. మెదక్ లో స్థానిక యువతకు ఉద్యోగాలు లేవని రఘునందన్ రావు పేర్కొన్నారు. తనను గెలిపిస్తే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణలో ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ కు అహంకారం పెరిగిపోయిందనీ, ప్రజలను పలకరించే విధానం మారిపోయిందని దుయ్యబట్టారు. తెలంగాణలో ప్రశ్నించే గొంతులు ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

More Telugu News