Nara Lokesh: కుప్పం నుంచి మా వాళ్లే కాదు మంగళగిరి ప్రజలు వచ్చినా తలుపులు తెరిచే ఉంచుతాం: నారా బ్రాహ్మణి

  • ఇక్కడే ఇల్లు కట్టుకున్నాం
  • ఓట్లు కూడా ఇక్కడే ఉన్నాయి
  • మంగళగిరిలో బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం

ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ భార్య బ్రాహ్మణి కూడా భర్త తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. లోకేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లోకేశ్ అర్ధాంగి బ్రాహ్మణి మంగళగిరి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీటి సౌకర్యం కల్పిస్తామని అన్నారు. "నారా లోకేశ్ గారు" అంటూ ఎంతో గౌరవంగా సంబోధించిన బ్రాహ్మణి, తన భర్త ఎమ్మెల్యే కాకపోయినా ఐటీ మంత్రి హోదాలో ఈ ప్రాంతానికి 42 కంపెనీలు తీసుకువచ్చారని తెలిపారు. తద్వారా 3,500 ఉద్యోగాలు కూడా వచ్చాయని వివరించారు.

మంగళగిరి రాజధాని ప్రాంతంలో ఉంది కాబట్టి, రాబోయే ఐదేళ్లలో మరిన్ని సంస్థలు తీసుకువచ్చి 15,000 ఉద్యోగాల కల్పనకు కృషిచేస్తారని తెలిపారు. ఇప్పటికే ఇక్కడ రూ.40 వేల కోట్ల విలువైన పనులు జరిపిస్తున్నారని బ్రాహ్మణి వెల్లడించారు. లోకేశ్ గారు ఎమ్మెల్యే అయితే ఇంకా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని చెప్పారు. మంగళగిరిని మరోస్థాయికి తీసుకెళతారని హామీ ఇచ్చారు. ఇక్కడ ఎత్తిపోతల పథకాలు ఆశించిన స్థాయిలో లేవని తన దృష్టికి వచ్చిందని, ఇప్పటివరకు ఇక్కడ 50 శాతం మాత్రమే లిఫ్ట్ ఇరిగేషన్ ఉందని, లోకేశ్ గారు ఎమ్మెల్యే అయితే ఆగస్టు కల్లా 100 శాతం నీటిపారుదల తీసుకువస్తారని తెలిపారు. వచ్చే సీజన్ లో నీరందించే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు.

ఇక చేనేతల గురించి మాట్లాడుతూ, చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. స్వర్ణకారుల కోసం దుబాయ్ లో ఉండే గోల్డ్ మార్కెట్ తరహాలో పర్యాటకులను ఆకర్షించేలా భారీ విపణి ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు. మైనారిటీల పిల్లలకు విద్య, ఉపాధి కల్పన, ఆరోగ్య సదుపాయాలు అందజేస్తామని చెప్పారు. బ్యాంకుల ద్వారానే కాకుండా ప్రభుత్వం కూడా నేరుగా లోన్లు ఇస్తుందని బ్రాహ్మణి వెల్లడించారు. స్థలాల పట్టాల విషయంలో ఉన్న సమస్యలు తొలగిస్తామని, హౌసింగ్ సదుపాయాలు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు.

అంతేకాకుండా, మొదటిసారిగా పార్టీ మేనిఫెస్టో కాకుండా లోకేశ్ గారు స్వంతగా మంగళగిరి మేనిఫెస్టో రూపొందించారని ఆమె వెల్లడించారు. మంగళగిరిలో ఉన్న అన్ని సమస్యలను ఆ మేనిఫెస్టోలో పొందుపరిచారు. తమ ఇల్లు కూడా మంగళగిరిలోనే ఉందని, తమ ఓట్లు కూడా ఇక్కడే ఉన్నాయని అన్నారు. కుప్పం నుంచి తమ వాళ్లు వస్తే ఎలా ఆహ్వానిస్తామో, మంగళగిరి ప్రజలు వచ్చినా తమ ఇంటి తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని బ్రాహ్మణి స్పష్టం చేశారు. లోకేశ్ గారు ఇక్కడే ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకుని మొదట తన నియోజకవర్గ ప్రజల సమస్యలు పట్టించుకున్న తర్వాతే రాష్ట్ర వ్యవహారాలు చూసుకుంటారని తెలిపారు.

అభివృద్ధి ఆగకుండా ముందుకు సాగాలంటే నారా లోకేశ్ ను, ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ గారిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఓ వృద్ధురాలు వేదికపైకి ఎక్కి బ్రాహ్మణి వద్దకు వచ్చింది. ఆ వృద్ధురాలిని బ్రాహ్మణి ఇంటర్వ్యూ చేసిన విధానం అందరినీ అలరించింది. లోకేశ్ ఎన్నికల ఖర్చు కోసం ఆ వృద్ధురాలు తన పెన్షన్ సొమ్ములోంచి రూ.500 బ్రాహ్మణికి అందించింది.

  • Loading...

More Telugu News