హోదా వస్తుంది... సీఎం జగనే: వైసీపీ పంచాంగ శ్రవణం!

06-04-2019 Sat 09:46
  • వైసీపీ కేంద్ర కార్యాలయంలో కార్యక్రమం
  • జగన్ కు అన్ని గ్రహాలూ అనుకూలం
  • సుస్థిర పాలన, వర్షాలు సంతృప్తికరమన్న పండితులు

అనతికాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రానుందని వేద పండితులు పంచాంగశ్రవణంలో జోస్యం చెప్పారు. ఈ ఉదయం అమరావతిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పండితులు, ఈ వికారి నామ సంవత్సరం ఎలా ఉండబోతుందన్న అంశంపై విశ్లేషించారు. వైసీపీకి అధికారం లభిస్తుందని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు.

వర్షాలు సంతృప్తికరంగా ఉంటాయని, రైతులకు మంచి పంటలు పండుతాయని చెప్పారు. జగన్ కు అన్ని గ్రహాలూ అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. ఆయన సుస్థిరమైన పాలన అందిస్తారని అంచనా వేశారు. ఈ సంవత్సరం వివిధ రాశులకు సంబంధించిన ఆదాయ, వ్యయాలను, రాజ్యపూజ, అవమానాలను గురించి చెప్పిన పండితులు, ఒక్క సింహరాశి జాతకులకు మాత్రమే కొంత అననుకూలత కనిపిస్తోందని, మిగతా అన్ని రాశుల వారికీ మిశ్రమ, సత్ఫలితాలే కనిపిస్తున్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ కు వేదాశీర్వచనం చేసి, నూతన పట్టు వస్త్రాలను పండితులు అందించారు. ఆపై జగన్ వారిని సత్కరించి, తాంబూలాన్ని అందించారు.