బాలికలకు పోకిరి టీచర్ వేధింపులు.. కటకటాల వెనక్కు నెట్టిన ‘షీ టీమ్స్’ పోలీసులు!

05-04-2019 Fri 15:00
  • తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో ఘటన
  • లైంగిక వేధింపులపై స్కూలులో అవగాహన సదస్సు
  • రెండేళ్లుగా అమ్మాయిలను వేధిస్తున్న కామాంధుడి గుట్టురట్టు
పాఠశాల స్థాయిలో బాలికలకు లైంగిక విద్య, వేధింపులపై అవగాహన ఎందుకు కల్పించాలో చెప్పే ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. ‘షీ టీమ్స్’ పోలీసులు నిర్వహించిన అవగాహన కార్యక్రమంతో ధైర్యం తెచ్చుకున్న బాలికలు పాఠశాల ఉపాధ్యాయుడు వేధిస్తున్న విషయాన్ని బయటపెట్టారు. దీంతో పోలీసులు సదరు కీచకుడిని కటకటాల వెనక్కు నెట్టారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని ఘట్ కేసర్ మండంలో ఉన్న ఓ పాఠశాలలో షీ టీమ్స్ పోలీసులు లైంగిక వేధింపులపై అవగాహన సదస్సు నిర్వహించారు. అయితే ఇదే పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి గత రెండేళ్లుగా పాఠశాలలోని బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు సెల్ ఫోన్ లో వారి ఫొటోలు తీసి వేధిస్తున్నాడు. ఈ విషయం బయట ఎవరికైనా చెబితే అంతు చూస్తానని బెదిరించేవాడు. ఈ నేపథ్యంలో లైంగిక వేధింపులపై సదస్సు నిర్వహించిన షీ టీమ్స్ సభ్యులు.. వేధింపులు ఎదురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయాలనీ, పోలీసులు చర్యలు తీసుకుంటారని సూచించారు.

వెంటనే స్పందించిన బాలికలు.. పాఠశాల టీచర్ తమను రెండేళ్లుగా లైంగికంగా వేధిస్తున్నారని వాపోయారు. ఆయన వెకిలి చేష్టలను వ్యతిరేకిస్తే కొడుతున్నారని కన్నీరు పెట్టుకున్నారు. దీంతో  కీచక టీచర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను 2013 నుంచి ఇక్కడే పనిచేస్తున్నాడు. కాగా, బాలికలను వేధించవద్దనీ, ప్రవర్తన మార్చుకోవాలని తాము పలుమార్లు హెచ్చరించినా అతను మారలేదని తోటి ఉపాధ్యాయులు కూడా పోలీసులకు తెలిపారు. ఈ నేపథ్యంలో నిందితుడిపై పోక్సో చట్టంలోని 8,12 సెక్షన్ల కింద కేసు నమోదుచేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు. కాగా, ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు బాలికలు కృతజ్ఞతలు తెలిపారు.