Rahul Gandhi: మోదీకి 'ఐ లవ్ యూ' చెప్పిన రాహుల్ గాంధీ

  • బాలాకోట్ దాడులను రాజకీయం చేయరాదు
  • భారత్ ప్రతి రోజు 72వేల ఉద్యోగాలను కోల్పోతోంది
  • మోదీ నాలా ఎందుకు సమాధానాలు చెప్పలేకపోతున్నారు?

ప్రధాని మోదీపై తనకు ఎలాంటి ద్వేషం, ఆగ్రహం లేవని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. 'ఐ లవ్ నరేంద్ర మోదీ' అంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు. పూణెలో విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్ లోని బాలాకోట్ లో ఉన్న ఉగ్రవాదుల శిబిరాలపై భారత్ దాడుల గొప్పదనం మన వైమానిక దళానిదని... ఆ దాడులను రాజకీయం చేయరాదని అన్నారు. నాయకులకు జవాబుదారీతనం ఉండాలని చెప్పారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు తాను ధైర్యంగా సమాధానాలు చెబుతున్నానని... తనలా మోదీ ఎందుకు సమాధానాలు చెప్పలేకపోతున్నారని అన్నారు. మోదీపై తనకు ప్రేమ ఉందని, ద్వేషం ఏమాత్రం లేదని చెప్పారు.

కనీస ఆదాయ భరోసా పథకం ద్వారా పేదలకు ఏడాదికి రూ. 72,000 వేస్తామంటూ తాము ఇచ్చిన హామీని నెరవేర్చుతామని రాహుల్ అన్నారు. భారత్ ప్రతి రోజు 27వేల ఉద్యోగాలను కోల్పోతోందని చెప్పారు. అనిల్ అంబానీ, మెహుల్ చోక్సీలాంటి వ్యక్తుల ప్రయోజనాల కోసమే ఎన్డీయే ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు తాము కృషి చేస్తామని రాహుల్ చెప్పారు. ఉద్యోగాల్లో సైతం మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థపై ఎంతో ప్రతికూల ప్రభావాన్ని చూపిందని అన్నారు. దీని వల్ల కోట్లాది ఉద్యోగాలు పోయాయని విమర్శించారు.

More Telugu News