Sharmila: షర్మిల సభకు జనం లేక... ముందుకు కదలని కాన్వాయ్!

  • పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో సభ
  • జనం పలుచగా ఉండటంతో పావుగంట వేచిచూసిన షర్మిల
  • ఆపై ప్రసంగిస్తూ, చంద్రబాబుపై విమర్శలు
పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో వైసీపీ తరఫున నిలబడిన అభ్యర్థి శ్రీనివాసనాయుడు తరఫున ప్రచారం చేసేందుకు వచ్చిన షర్మిల, సభా వేదిక వద్ద అనుకున్నంత మంది ప్రజలు లేరని తెలియడంతో, తన కాన్వాయ్ ని 15 నిమిషాల పాటు నిలిపేశారు. దేవరాపల్లి నుంచి నిడదవోలుకు ఆమె బస్సు యాత్ర ప్రవేశించగా, సంత మార్కెట్ రోడ్డులో కాన్వాయ్ నిలిచిపోయింది. అప్పటికే స్థానిక పొట్టి శ్రీరాములు సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు వెళ్లిన పలువురు నాయకులు, జనాలు పలచగా ఉన్నారన్న విషయాన్ని కాన్వాయ్ కి చేరవేయగా ఆమె కాసేపు వేచి చూశారు.

నగరంలోకి ప్రవేశించిన కాన్వాయ్ సభా స్థలికి సమయానికి చేరుకోకపోవడంతో కాసేపు అయోమయ వాతావరణం ఏర్పడింది. ఆపై వేదిక వద్దకు వచ్చి ప్రసంగించిన షర్మిల, వైఎస్ఆర్ పాలనను మరోసారి చూడాలంటే జగనన్నను సీఎం చేయాలని సూచించారు. చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని, ఏ రైతుకైనా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందా? అని షర్మిల ప్రశ్నించారు.

ఏపీ సర్కారు అన్ని వర్గాలనూ విస్మరించిందని, ఎన్నికలకు రెండు నెలల ముందు పెన్షన్లను పెంచుతున్నట్టు ప్రకటించిన చంద్రబాబు, మిగతా నాలుగున్నరేళ్లలో పెన్షన్లు ఎందుకు పెంచలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు.
Sharmila
Nidadavolu
Convoy
Campaign

More Telugu News