ADR: టీడీపీ పనితీరు 'బిలో యావరేజ్' మాత్రమే... ప్రజలు మార్పును కోరుతున్నారు: ఏడీఆర్ సర్వే వివరాలు

  • చంద్రబాబు ప్రభుత్వంపై పూర్తి సంతృప్తి లేదు
  • అన్ని పార్టీలూ ఒంటరిగా పోటీ చేయడం వైసీపీకి ప్లస్ పాయింట్
  • కీలక హామీలను అమలు చేయలేదంటున్న ప్రజలు
  • 12,500 మందిని ప్రశ్నించామన్న ఏడీఆర్

ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు తెలుగుదేశం సర్కారు పనితీరుపై పూర్తి సంతృప్తిగా లేరని, చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, రాష్ట్రవ్యాప్తంగా తాము నిర్వహించిన సర్వేలో ప్రభుత్వ పనితీరు 'బిలో యావరేజ్' అని తేలిందని ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ ది డెమొక్రటిక్ రిఫార్మ్స్) వెల్లడించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత, విడిగా తొలిసారి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటున్న ఏపీలో ఓటర్లు కొత్త ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని తెలిపింది.

ఈ ఎన్నికలు ఏపీలో హోరాహోరీగా సాగనున్నాయని, ప్రధాన పార్టీలేవీ పొత్తు లేకుండా పోటీకి దిగాయని, అధికార తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో బీజేపీ, జనసేనలతో కలిసి పోటీ చేసిందని ఏడీఆర్ గుర్తు చేసింది. ఈ దఫా ఈ మూడు పార్టీలూ కలిసి లేవని, అది విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ప్లస్ పాయింట్ కానుందని అభిప్రాయపడింది.

అధికారాన్ని నిలుపుకునేందుకు, ఓటర్లను ఆకర్షించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, తనకు తెలిసిన అన్ని అస్త్రాలనూ వినియోగిస్తున్నారని, అయితే, ప్రజలు మాత్రం గతంలో ఆయన చేసిన కీలక హామీల అమలుపై అసంతృప్తితో ఉన్నారని ఏడీఆర్ వెల్లడించింది.

రాష్ట్రంలోని 25 లోక్ సభ నియోజకవర్గాల్లోని 12,500 మందిని తమ సర్వేలో భాగంగా ప్రశ్నించామని, పనితీరుపై గుడ్, యావరేజ్, పూర్ ఆప్షన్లు ఇచ్చామని, ఉద్యోగావకాశాలు, తాగునీరు, మెరుగైన ఆసుపత్రులు తదితరాలపైనా ప్రశ్నించగా, అన్ని అంశాల్లోనూ ప్రజలు చంద్రబాబు ప్రభుత్వానికి 'బిలో యావరేజ్' అనే సమాధానం ఇచ్చారని తెలియజేసింది.

పట్టణ ప్రాంతాలతో పాటు, గ్రామీణ ప్రాంతాల ప్రజల నుంచి కూడా ఇదే రకమైన అభిప్రాయం వచ్చిందని ఏడీఆర్ తెలిపింది. ప్రతి అంశంపైనా గరిష్ఠంగా 5 పాయింట్లు కేటాయించామని వ్యవసాయానికి నీటి అంశంపై ప్రభుత్వ పనితీరుకు 2.13 పాయింట్లు, విత్తనాలు, పురుగుమందుల లభ్యతపై 1.99 పాయింట్లు, వ్యవసాయానికి కరెంటు సరఫరాపై 2.19 పాయింట్లు, ఉద్యోగావకాశాలపై 2.13 పాయింట్లు లభించాయని తెలిపింది.

తాగునీటి లభ్యతపై 1.91 పాయింట్లు, నీరు, వాయు కాలుష్య నివారణపై 2.19 పాయింట్లు లభించాయని, 5 పాయింట్లు వస్తే బాగుందని, 3 పాయింట్లు వస్తే ఫర్వాలేదని, 1 పాయింట్ వస్తే బాగాలేదన్న అర్థం వచ్చేలా జవాబులను క్రోడీకరించి ఈ ఫలితాలను ఇస్తున్నామని ఏడీఆర్ స్పష్టం చేసింది.

More Telugu News