Telugudesam: ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఇంకా విధులు నిర్వహిస్తున్నారు... కోర్టులో వైసీపీ పిటిషన్‌

  • వైసీపీ ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి పిటిషన్‌ దాఖలు
  • అనధికారికంగా విధులు నిర్వహిస్తున్నారని కోర్టు దృష్టికి
  • సోమవారానికి విచారణ వాయిదా వేసిన న్యాయస్థానం

కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఎ.బి.వెంకటేశ్వరరావు అనధికారికంగా ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి ఈ మేరకు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ పలువురు ఐపీఎస్ లపై  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వెంకటేశ్వరరావుతోపాటు కడప, శ్రీకాకుళం ఎస్పీలపై ఈసీ వేటువేసిన విషయం తెలిసిందే. వారిని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేసింది. అయితే ఎస్పీలను బదిలీ చేసినా, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఎన్నికల విధుల పరిధిలోకి రారంటూ, ప్రభుత్వం ప్రత్యేక జీఓ జారీ చేయడం వివాదానికి దారితీసింది.

కోర్టులో వాద ప్రతివాదనల తర్వాత ఈసీ ఆదేశాలను శిరసావహించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేయడంతో ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు బదిలీ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇప్పటికీ వెంకటేశ్వరరావు అనధికారికంగా విధులు నిర్వహిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. కింది స్థాయి ఉద్యోగులకు నివేదికలు ఇస్తున్నారని పేర్కొన్న పిటిషనర్‌ ఇంటెలిజెన్స్‌ విధుల్లో కలుగజేసుకోకుండా, ఆయన ఇచ్చిన నివేదికలను పరిగణనలోకి తీసుకోకుండా చూడాలని కోరారు. పిటిషన్‌ స్వీకరించిన కోర్టు విచారణను సోమవారానికి వాయిదావేసింది.

More Telugu News