EC: సాయంత్రం ఆరు గంటల వరకు ఓటేయవచ్చు.. గంట సమయం పెంచిన ఎన్నికల సంఘం

  • ఇప్పటి వరకు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకే
  • సాయంత్రం 6 వరకు సమయం పెంచుతూ ఆదేశాలు
  • ఓటర్ల పెరుగుదల, వీవీ ప్యాట్‌ల వినియోగంతో తాజా నిర్ణయం

ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరగడం, వీవీ ప్యాట్‌ల వినియోగం వల్ల ఓటింగ్‌కు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉండడంతో ఎన్నికల సంఘం పోలింగ్‌ సమయాన్ని గంట పెంచింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగిసే పోలింగ్‌ ప్రక్రియను ఆరు గంటల వరకు పెంచుతూ తాజా ఆదేశాలు జారిచేసింది.

అంటే సాయంత్రం ఆరు గంటల సమయానికి పోలింగ్‌ బూత్‌ వద్దకు చేరుకున్న ప్రతి ఒక్క ఓటరుకు ఎంత రాత్రయినా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తారు. ఎన్నికల్లో ఈవీఎంలు వినియోగిస్తున్న విషయం తెలిసిందే. మరింత పారదర్శకత కోసం ఈవీఎంలకు వీవీ ప్యాట్‌ను అనుసంధానించి ఓటరు తాను వేసిన ఓటు సవ్యంగా పడిందీ, లేనిదీ పరిశీలించుకునే అవకాశం కూడా ఇటీవల కల్పించారు. వీవీ ప్యాట్‌లో స్లిప్‌ కనిపించి వెళ్లేందుకు ఏడు సెకన్ల సమయం పడుతుంది.

దీనివల్ల ఓటర్లు ఓటింగ్‌కు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంది. అదే విధంగా మండు వేసవి కాలం, ఎండలు మండిపోతుండడంతో సాయంత్రం కాస్త వాతావరణం చల్లబడ్డాక పోలింగ్‌ కేంద్రానికి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఎన్నికల సంఘం ఈసారి ఓ గంట అదనపు సమయాన్ని కేటాయించిందని, దీనివల్ల గరిష్టంగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కలుగుతుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.

More Telugu News