Currency: ఎన్నికల నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాల్లో కనిపించని 2 వేల నోటు!

  • ఏటీఎంలలో రూ. 500, రూ. 100 నోట్లే
  • ఎన్నికల కారణంగానే షార్టేజ్
  • పెద్ద నోట్లను దాచేస్తున్న అభ్యర్థులు!

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు, ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు రోజులు దగ్గరకు వచ్చే కొద్దీ, 2 వేల రూపాయల నోట్లు మాయం అవుతున్నాయి. ఇప్పటికే ఏటీఎంలలో డబ్బు విత్ డ్రా చేసుకునేందుకు వెళితే రూ. 500, రూ. 200, రూ. 100 నోట్లు తప్ప, రూ. 2 వేల నోటు బయటకు రావట్లేదు. రాజకీయ పార్టీల నేతలు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారు 2 వేల నోట్లను దాచారని, అందువల్లే పెద్ద నోటుకు కొరత ఏర్పడిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. హైదరాబాద్ లోని ఏటీఎంలలో పెద్ద నోట్లు ఏ మాత్రమూ కనిపించడం లేదు. ఇక పోలీసులకు పట్టుబడుతున్న డబ్బులో అత్యధికం ఈ పెద్ద నోట్లే ఉంటున్నాయి.

గత సంవత్సరం మార్చిలో దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీలో సగానికి పైగా ఉన్న రూ. 2 వేల నోట్లు, ఈ సంవత్సరం మార్చికి వచ్చే సరికి 37.3 శాతానికి తగ్గాయి. ఆర్బీఐ వెల్లడించిన డేటా ప్రకారం మార్చి 2017 నాటికి మొత్తం 3,285 మిలియన్లు, మార్చి 2018 నాటికి 3,363 మిలియన్ల రూ. 2 వేల నోట్లు చలామణిలో ఉన్నాయి.

"గడచిన మూడు నెలలుగా డిపాజిట్ల రూపంలో రూ. 2 వేల నోట్లు బ్యాంకులకు రావడం లేదు. ఆర్బీఐ నుంచి కూడా సరఫరా లేకపోవడంతోనే షార్టేజ్ ఏర్పడింది. ఎన్నికలు ముగిసిన తరువాత పరిస్థితి అదుపులోకి వస్తుందని భావిస్తున్నాం" అని ఆంధ్రా బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి కొండల్ రావు వ్యాఖ్యానించారు.

More Telugu News