మురళీమోహన్ కోడలు విజయం కోసం నారా రోహిత్ ప్రచారం!

04-04-2019 Thu 08:28
  • రాజమహేంద్రవరం నుంచి పోటీ పడుతున్న మాగంటి రూప
  • పలు ప్రాంతాల్లో నారా రోహిత్ రోడ్ షో
  • సంక్షేమ పథకాలే ఓట్లను కురిపిస్తాయని వ్యాఖ్య
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేది టీడీపీయేనని, మరోసారి చంద్రబాబు సీఎంగా పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారని సినీ నటుడు నారా రోహిత్ వ్యాఖ్యానించారు. రాజమహేంద్రవరం లోక్ సభ స్థానానికి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న మురళీమోహన్ కోడలు మాగంటి రూపకు మద్దతుగా సీతానగరం, రఘుదేవపురం ప్రాంతాల్లో ప్రచారం చేసిన రోహిత్, మంచి చేసే నేతలను ప్రజలు ఎన్నటికీ మరచిపోబోరని అన్నారు.

గత ఐదేళ్లలో ఏపీలో జరిగిన అభివృద్ధే ఓట్లను కురిపిస్తుందని, చంద్రబాబు ప్రభుత్వం అన్ని వర్గాల వారికీ సంక్షేమాన్ని దగ్గర చేసిందని రోహిత్ వ్యాఖ్యానించారు. పథకాల లబ్ధిదారులంతా టీడీపీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజానగరం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి పెందుర్తి వెంకటేశ్ కూడా పాల్గొన్నారు.