Congress: కాంగ్రెస్ మేనిఫెస్టో నయవంచక పత్రం.. అదో అబద్ధాల పుట్ట: ప్రధాని మోదీ

  • కాంగ్రెస్ మేనిపెస్టో నిండా అబద్ధాలే
  • మే 23తో దాని ఎక్స్‌పైరీ డేట్ ముగిసిపోతుంది
  • పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి దీదీ స్పీడ్‌బ్రేకర్‌లా తయారయ్యారు

ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోపై విమర్శలు కురిపించారు. పాసీఘాట్‌లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక నయవంచక పత్రమన్నారు. దాని నిండా అబద్ధాలు తప్ప మరోటి లేవన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ దేశ వ్యతిరేకులకు మద్దతు తెలుపుతుందని దుయ్యబట్టారు.

త్రివర్ణ పతాకాన్ని దహనం చేసిన వారికి, దేశాన్ని ముక్కలు చేస్తామన్న వారికి, విదేశీ శక్తులతో కుమ్మక్కయ్యే వారికి, అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేసే వారివైపే కాంగ్రెస్ ఉంటుందని ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఎక్స్‌పైరీ డేట్ మే 23తో ముగిసిపోతుందని ఎద్దేవా చేశారు. కాగా, ప్రధాని మోదీ వారం రోజుల్లోనే రెండోసారి అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించడం గమనార్హం.

కోల్‌కతా, సిలిగురిలలో జరిగిన సభల్లోనూ కాంగ్రెస్, టీఎంసీలపై మోదీ విరుచుకుపడ్డారు. ఆర్మీ ఆత్మస్థైర్యాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌లు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్పీడ్ బ్రేకర్‌లా తయారయ్యారని ఆరోపించారు.

More Telugu News