Chandrababu: ఒక ఐటీ దాడి చేస్తే 50 సీట్లు పోతాయి మీకు.. దేశమంతా తిరిగి చెబుతా!: మోదీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు

  • ప్రత్యేక హోదా అడగడం తప్పా?
  • విభజన హామీలు కోరడం తప్పా?
  • నిలదీసిన చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో తీవ్రత పెంచారు. గుంటూరు జిల్లా వినుకొండ రోడ్ షోలో ఆయన నిప్పులు చెరిగే ప్రసంగంతో ఆద్యంతం అభిమానులను అలరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జగన్, కేసీఆర్ సహా ప్రధాని నరేంద్ర మోదీని కూడా వదలకుండా విమర్శలు గుప్పించారు. అయితే, ప్రసంగంలో ఉన్నట్టుండి సీరియస్ గా మారిపోయిన చంద్రబాబు, తమ పార్టీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ పై ఐటీ దాడుల విషయాన్ని ప్రస్తావించారు. ప్రత్యేక హోదా అడగడం తప్పా? విభజన హామీలు అడగడం తప్పా? తెలంగాణ నుంచి వాటా కోరడం తప్పా? అలా అడిగినందుకు ఐటీ దాడులు చేయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

"ఇవాళ మన మైదుకూరు అభ్యర్థి, డీసీసీబీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై ఐటీ దాడులు నిర్వహించారు తమ్ముళ్లూ! ఇలాంటి దాడులతో మన ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. మీకు మీ రాష్ట్రాల్లో కనిపించడం లేదా అవినీతిపరులు? ఇక్కడ వైసీపీ అవినీతి మీకు కనిపించడం లేదా? తెలంగాణ నుంచి వస్తున్న డబ్బులు కనిపించడం లేదా? మేం డబ్బులు లేకపోయినా కష్టపడి పనిచేస్తుంటే మా మనోనిబ్బరాన్ని దెబ్బతీయడానికి దాడులు చేస్తున్నారు. ఐటీ దాడులకు తీవ్ర పరిణామాలు ఉంటాయి. మీరు ఒక్క దాడి చేస్తే మీకు 50 సీట్లు పోతాయి, ఇక్కడే కాదు దేశమంతా తిరిగి చెబుతాను, మీరు ఇదే విధంగా చేస్తే ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు వదిలిపెట్టను" అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేశారు.

  • Loading...

More Telugu News