GVLnarasimharao: అక్రమార్కుల పాలనకు త్వరలోనే చరమగీతం : బీజేపీ నేత జీవీఎల్‌

  • రాష్ట్రంలో దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది
  • ప్రతి స్కీంలోనూ ఓ స్కాం ఉందని ఎద్దేవా
  • కాంగ్రెస్‌కు పట్టిన గతే టీడీపీకి పట్టనుందని జోస్యం

ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న అక్రమార్కుల పాలనకు త్వరలోనే ప్రజలు చరమగీతం పాడనున్నారని బీజేపీ ఎంపీ జి.వి.ఎల్‌.నరసింహారావు అన్నారు. రాష్ట్రంలో యథేచ్ఛగా దోపిడీ సాగుతోందని ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తుని పట్టణంలో నిన్న ఆయన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎప్పటిలాగే అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి స్కీంలోనూ ఓ స్కాం దాగి ఉందని ధ్వజమెత్తారు. అక్రమార్కుల రాజకీయాలకు ఎన్నికల తర్వాత తెరపడనుందని, కాంగ్రెస్‌కు పట్టిన గతే తెలుగుదేశం పార్టీకి పట్టనుందని జోస్యం చెప్పారు. మంత్రి సొంత నియోజకవర్గం అంటే ఎంతో అభివృద్ధి చెంది ఉంటుందని భావిస్తామని, కానీ తుని నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం ఎక్కడా కనిపించడం లేదన్నారు.

30 ఏళ్లనాడు పట్టణం ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉందన్నారు. దుర్మార్గపు రాజకీయాలకు, రాక్షస విధానాలకు మంత్రి యనమల రామకృష్ణుడు నాయకత్వం వహిస్తున్నారని విమర్శించారు. యనమల పట్ల ప్రజల్లో తీవ్రవ్యతిరేకత ఉందని, ఆయనకు ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయమన్నారు. బీజేపీ అభివృద్ధికి కట్టుబడిన పార్టీ అని, న్యాయమైన పాలన అందిస్తుందని, రాష్ట్రంలో బీజేపీని ఆదరిస్తే ఎంతో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.

More Telugu News