Uttar Pradesh: లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగిన అత్యంత పేద అభ్యర్థి ఇతడే!

  • బ్యాంకు ఖాతాలో పైసా కూడా లేని లోక్‌సభ అభ్యర్థి
  • కాకలు తీరిన యోధుల మధ్య బరిలోకి 
  • యూపీలోని ముజఫర్ నుంచి బరిలోకి న్యాయవాది
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బరిలో కోటీశ్వరుల జాబితా కొండవీటి చాంతాడంత ఉంది. పోటీ చేస్తున్న వారందరూ కాకలు తీరిన యోధులే. వారి మధ్య పేదరికంతో బక్కచిక్కిన వ్యక్తి కూడా ఉన్నాడు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్నవారిలో అత్యంత పేద వ్యక్తి అతడే. యూపీలోని ముజఫర్‌నగర్ నుంచి బరిలోకి దిగిన ఆయన పేరు మంగెరామ్ కశ్యప్. వృత్తిరీత్యా న్యాయవాది 51 ఏళ్ల కశ్యప్.. 2000వ సంవత్సరంలో ‘మజ్దూర్ కిసాన్ యూనియన్ పార్టీ’ని స్థాపించాడు.  అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతీ ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేస్తున్నారు.

తాజా ఎన్నికల్లోనూ బరిలోకి దిగిన ఆయన నామినేషన్ సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ చర్చనీయాంశమైంది. తన వద్ద నగదు లేదని, బ్యాంకులో కూడా సొమ్ము లేదని పేర్కొన్నారు. తన భార్య వద్ద కూడా నగదు లేదని, ఆమె బ్యాంకు ఖాతాలోనూ సొమ్ము లేదని పేర్కొన్నాడు. అయితే, తమకు ఓ చిన్న ఫ్లాట్ ఉందని, రూ.15 లక్షల విలువల చేసే చిన్న ఇల్లు కూడా ఉందని పేర్కొన్నారు. అది కూడా తన స్వార్జితం కాదని, తన అత్తింటివారు బహుమానంగా ఇచ్చారని వివరించారు. అలాగే, 36 వేల విలువ చేసే బైక్ కూడా ఉందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కాగా, ప్రతీ ఎన్నికల సమయంలోనూ నాయకుల ఆస్తులు రెట్టింపు అవుతుండగా, కశ్యప్ మాత్రం మరింత పేదవాడిగా మారుతుండడం గమనార్హం.
Uttar Pradesh
Lawyer
muzaffarnagar
Lok Sabha Elections

More Telugu News