ponguleti sudhakarreddy: తెలంగాణలో కాంగ్రెస్‌కు బిగ్‌షాక్‌!... కాషాయం కండువా కప్పుకోనున్న పొంగులేటి?

  • కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా
  • పార్టీని రాష్ట్ర నాయకత్వం భ్రష్ఠుపట్టించిందని ధ్వజం
  • ధనరాజకీయాలకే పెద్దపీట అని విమర్శలు

తెలంగాణలో కాంగ్రెస్‌ అస్తవ్యస్తమవుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు, ఎమ్మెల్యేలు పార్టీని వీడగా తాజాగా సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు పొంగులేటి సుధాకర్‌ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి పెద్ద షాకిచ్చారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి పంపించారు. పొంగులేటి ఈరోజు మధ్యాహ్నం తర్వాత ప్రధాని మోదీని కలవనున్నారు. మోదీతో సంప్రదింపుల అనంతరం కాషాయ కండువా కప్పుకునేందుకు ముహూర్తం నిర్ణయించుకోనున్నారని సమాచారం. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలంతా టీఆర్‌ఎస్‌లోకి, పలువురు సీనియర్‌ నాయకులు బీజేపీలోకి క్యూకట్టిన సమయంలో పార్టీకి ఇది పెద్ద దెబ్బేనని భావిస్తున్నారు.

పైగా తెలుగు రాష్ట్రాల్లో రాహుల్‌గాంధీ పర్యటన ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఎన్‌ఎస్‌యూఐలో విద్యార్థి నాయకునిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పొంగులేటి సుదీర్ఘ కాలం ఆ పార్టీలో ఉన్న వ్యక్తి.  ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన పదవీ కాలం ఈనెల 29వ తేదీతో ముగిసింది.

పార్టీకి రాజీనామా చేసిన సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీలో ధనరాజకీయం బాగా పెరిగిపోయిందన్నారు.ఎమ్మెల్సీ, ఎంపీ టికెట్ల కేటాయింపులో ఇది స్పష్టంగా కనిపించిందన్నారు. రాష్ట్ర నాయకత్వం కారణంగా పార్టీ భ్రష్టుపట్టిపోయిందని, ఇదే విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లినా వారు పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. తాను పార్టీని వీడడానికి ఇదే కారణమని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News