Guntur District: యువత భవిష్యత్తు కోసమే ‘జనసేన’ పోరాటం: నాదెండ్ల మనోహర్

  • తెనాలిలో ‘మన ఊరు- మన మనోహర్’ కార్యక్రమం
  • యువతకు అండగా నిలబడతాం
  • సమాజంలో మార్పు తీసుకువస్తాం
యువత భవిష్యత్తు కోసమే ‘జనసేన’ పోరాటం అని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. ‘మన ఊరు- మన మనోహర్’ పర్యటనలో భాగంగా తెనాలిలోని  21, 22,  23, 24, 35, 36,37వ వార్డులలో ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పదవులు లేకపోతే బతకలేము అనే భావనతో ‘జన సైనికులు’ లేరని అన్నారు. యువతకు అండగా నిలబడేందుకు, సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు, అందరికీ సాయం అందించాలన్న లక్ష్యంతో ‘జనసేన’ ఉందని అన్నారు.

తెనాలి అభివృద్ధికి మంచి ప్రణాళిక ఉందని, ‘జనసేన’ మేనిఫెస్టో, పార్టీ భావజాలం ప్రకారం సమాజంలోని కింది స్థాయి వారిని పైకి తీసుకు వచ్చి వారికి మంచి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనే ఉందని అన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఏపీ ప్రభుత్వం ప్ర‌జ‌ల‌ కష్టాలను పట్టించుకునే పరిస్థితిలో లేదని విమర్శించారు.  

అమరావతి అభివృద్ధితో పాటుగా చుట్టుపక్క‌ల ఉన్న పట్టణాల అభివృద్ధిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. మంచి ప్రణాళికతో అభివృద్ధి చేస్తే విజయవాడ, గుంటూరుకు దీటుగా తెనాలి అభివృద్ధి చెందుతుందని అన్నారు.కాగా, నాదెండ్ల మ‌నోహ‌ర్ అధ్వ‌ర్యంలో 24వ వార్డులోని వైసీపీ, టీడీపీకి చెందిన 100 మంది కార్యకర్తలు ‘జ‌న‌సేన’లో చేరారు. వారికి పార్టీ కండువా క‌ప్పి సాద‌రంగా ‘జనసేన’లోకి ఆహ్వానించారు.
Guntur District
Tenali
Janasena
Nadendla

More Telugu News