Tamilnadu: తమిళనాడులో డీఎంకే కోశాధికారి దురైమురుగన్ కాలేజీలు, ఇంటిపై ఐటీ శాఖ దాడులు!

  • ఈసీ అధికారులతో కలిసి వెల్లూరులో సోదాలు
  • అరక్కోణంలో సెర్చ్ వారెంట్ తో తనిఖీలపై డీఎంకే అభ్యంతరం
  • రాజకీయ ఒత్తిడితోనే ఈ దాడులన్న డీఎంకే నేత పరంధామం

లోక్ సభ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ఐటీ శాఖ, ఎన్నికల సంఘం తమిళనాడులో డీఎంకే కోశాధికారి దురై మురుగన్ కాలేజీల్లో తనిఖీలు చేపట్టాయి. వెల్లూరులోని ఆయన నివాసానికి ఈరోజు తెల్లవారుజామున చేరుకున్న అధికారులు సోదాలు ప్రారంభించారు. అదే సమయంలో మరో టీమ్ కింగ్‌స్టన్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్, దురై మురుగన్‌ బీఈడీ కాలేజీల్లో తనిఖీలు చేపట్టాయి.

మరోవైపు అరక్కోణంలో భారీ నగదు ఉందని సమాచారం ఉంటే అక్కడ తనిఖీలు చేయకుండా తమ ఇల్లు, కాలేజీల జోలికి రావడం ఏంటని డీఎంకే నేతలు మండిపడ్డారు. ఈ సందర్భంగా డీఎంకే వర్గాలు, అధికారులకు వాగ్వాదం చోటుచేసుకుంది.

సరైన సెర్చ్ వారెంట్ లేనందున తనిఖీలు చేపట్టనివ్వమని డీఎంకే కార్యకర్తలు స్పష్టం చేయడంతో అధికారులు వెనుదిరిగారు. అనంతరం కొద్దిసేపటికే ఆదాయపు పన్ను శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ విజయ్‌ దీపన్‌ నేతృత్వంలో మరో బృందం మురుగన్‌ ఇంటికి చేరుకుని సోదాలు ప్రారంభించింది.

ఈ నేపథ్యంలో డీఎంకే నేత పరంధామం మాట్లాడుతూ.. రాజకీయ ఒత్తిడితోనే ఈ దాడులు కొనసాగుతున్నాయని ఆరోపించారు. సోదాల పేరుతో అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కర్ణాటకలో సీఎం కుమారస్వామి సోదరుడు రేవణ్ణ ఇల్లు, కార్యాలయంతో పాటు ఆయన అనుచరులు, కాంట్రాక్టర్ల ఇళ్లు, ఆఫీసులపై ఐటీ శాఖ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.

More Telugu News