Andhra Pradesh: ఆంధ్రాపై ఇంత అక్కసా?: మోదీ వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం

  • మోదీ సన్ సెట్ వ్యాఖ్యలపై ఆగ్రహం
  • ఏపీపై మళ్లీ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు
  • అమరావతిలో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

ప్రధాని మోదీ నిన్న జరిగిన కర్నూలు సభలో ‘సన్ సెట్ ఆంధ్రప్రదేశ్’ అని చెప్పడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడి  అభివృద్ధి చేసుకుంటున్న రాష్ట్రంపై ఇంత అక్కసు ఎందుకని ప్రశ్నించారు. కర్నూలు సభతో ఏపీపై మోదీకి ఉన్న అక్కసు మరోసారి బయటపడిందని వ్యాఖ్యానించారు. ఏపీకి ఎలాంటి నిధులు, ప్రాజెక్టులు ఇవ్వకుండా మళ్లీ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. అమరావతిలో టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు ఈరోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీకి ఇచ్చిన నిధుల విషయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ శ్వేతపత్రం విడుదల చేసేందుకు మోదీ ముందుకు రాకపోతే, తానే రాష్ట్రం తరఫున విడుదల చేస్తానని వ్యాఖ్యానించారు. మోదీ సభకు వైసీపీ కార్యకర్తలను తరలించారనీ, తద్వారా బీజేపీ-వైసీపీ బంధం మరోసారి బయటపడిందని దుయ్యబట్టారు.

ఇక ప్రజల్లో మనకు అనుకూలత ఉంది కదా.. అని అతివిశ్వాసానికి పోవద్దని చంద్రబాబు టీడీపీ శ్రేణులకు సూచించారు. చివరివరకూ బాగా కష్టపడాలని దిశానిర్దేశం చేశారు. ఈసారి ఎన్నికల నేపథ్యంలో ఇన్ చార్జీల వ్యవస్థ ఉండదనీ, టీడీపీని ఏకపక్షంగా గెలిపించాలని ప్రజలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ‘ఎమ్మెల్యేలు అవుతున్నాం, మనకు ఏమీ ఢోకా లేదు’ అనే భావన ఎవ్వరిలోనూ ఉండరాదన్నారు. నేతలు-కార్యకర్తలు కలిసి పనిచేసినప్పుడే గెలుపు ఏకపక్షమవుతుందని తెలిపారు.

More Telugu News