Andhra Pradesh: కేంద్ర ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేసిన ధర్మాసనం!

  • అభ్యర్థుల నేరచరిత్ర ప్రచురణపై వివరణ కోరిన సుప్రీం
  • సానుకూలంగా స్పందించని ఎన్నికల సంఘం
  • వారం రోజుల్లోగా జవాబివ్వాలని ఈసీకి నోటీసులు

కేంద్ర ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్టు ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల నేర చరిత్రను పత్రికలు, టీవీల్లో ప్రచురించేలా చేయాలని గతేడాది ఇచ్చిన తీర్పును ఈసీ అమలు చేయకపోవడాన్ని ఆక్షేపించింది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘానికి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేసింది.

ఇప్పటివరకూ ఈసీ తమ ఆదేశాలను అమలు చేయలేదని సుప్రీంకోర్టు తెలిపింది. తమపై ఉన్న కేసుల వివరాలను అభ్యర్థులు ఎవరూ మీడియాలో ప్రచురించలేదని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో తమ ఆదేశాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని కోరింది. అయితే ఈసీ ఈ విషయమై సానుకూలంగా స్పందించకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ధిక్కరణ నోటీసులు జారీచేసింది.

రాజకీయ పార్టీల అభ్యర్థులు, వారిపై నమోదైన కేసుల వివరాలను పత్రికలు, టీవీలు, వెబ్ సైట్లలో ప్రచురించడంపై వారం రోజుల్లోగా జవాబు ఇవ్వాలని ఈసీని ఆదేశించింది. ఆ తర్వాత తాము తీసుకునే చర్యలకు సైతం సిద్ధంగా ఉండాలని సూచించింది.

More Telugu News