Andhra Pradesh: రాయదుర్గంలో కాల్వ శ్రీనివాసులుపై వైసీపీ నిఘా.. 21 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

  • కాల్వ ప్రచార బృందంలో కలిసిపోయిన వైసీపీ కార్యకర్తలు
  • ఫొటోలు, వీడియోలు కాపు రామచంద్రారెడ్డికి చేరవేత
  • రాయదుర్గంలో ఇంకో 100 మంది ఉన్నారన్న నిందితుడు

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. తాజాగా టీడీపీ నేత, మంత్రి కాల్వ శ్రీనివాసులపై నిఘా పెట్టి రహస్యంగా ఫొటోలు, వీడియోలు సేకరిస్తున్న 21 మంది వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా ఏలూరు, భీమవరానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. వీరంతా కాల్వ శ్రీనివాసులు ప్రచార బృందంలో కలిసిపోయి ఆయన కదలికలను వైసీపీ నేత కాపు రామచంద్రారెడ్డికి అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ..‘అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి పోటీ చేస్తున్న కాల్వ శ్రీనివాసులు కదలికల్ని రహస్యంగా చిత్రీకరిస్తున్న కొండా శివనాగరాజు అనే యువకుడిని టీడీపీ కార్యకర్తలు నిన్న రాత్రి పట్టుకున్నారు. అతడిని విచారించడంతో తనతో పాటు ఇంకో 21 మంది ఉన్నారని నాగరాజు చెప్పాడు. దీంతో ఆ 21 మందిని టీడీపీ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

విచారణలో వీరంతా కాల్వ శ్రీనివాసులు ప్రచారం, కదలికల ఫొటోలు, వీడియోలను వైసీపీ రాయదుర్గం అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డికి అందిస్తున్నట్లు తేలింది. వీరంతా కాపు రామచంద్రారెడ్డి వియ్యంకుడు శ్రీరామరెడ్డికి చెందిన కంపెనీలో పనిచేస్తున్నారు’ అని తెలిపారు. రాయదుర్గంలో ఇంకో 100 మంది వైసీపీ కార్యకర్తలు ఉన్నారని నాగరాజు చెప్పాడని వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేశామనీ, ఈరోజు కోర్టులో హజరుపరుస్తామని పేర్కొన్నారు.

More Telugu News