Khammam District: ఎన్నికల ప్రచారంలో నోరు జారిన నామా.. సైకిలు గుర్తుకే మన ఓటు అనడంతో టీఆర్ఎస్ నేతల అవాక్కు!

  • ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ నేతల పొరపాట్లు
  • పాత వాసనలు వదిలించుకోలేకపోతున్న నేతలు
  • కారుకు బదులు సైకిలుకు ఓటెయ్యాలని పిలుపు

ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎప్పుడూ లేనంత కొత్తగా ఉన్నాయి. ఏ నేత ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియని అయోమయం ప్రజల్లో నెలకొంది. ఇక పార్టీ మారిన నేతలు తమ పాత పార్టీని మర్చిపోలేకపోతున్నారు. కొత్త పార్టీలో చేరినా పాత వాసనలు మర్చిపోలేని వారు ప్రచారంలో నోరు జారి తర్వాత తీరిగ్గా నాలుక కరుచుకుంటున్నారు.

మంగళవారం మల్కాజిగిరిలో టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మల్కాజిగిరి ఎన్నికల ఇన్‌చార్జ్ సుధీర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రసంగాన్ని ముగిస్తూ.. ‘జై కేసీఆర్.. జై తెలుగుదేశం’ అని కుర్చీలో కూర్చున్నారు. జరిగిన పొరపాటును గ్రహించిన పక్కనే ఉన్న నేతలు ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో మళ్లీ మైకందుకుని ‘జై తెలంగాణ’ అని తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు.

ఇక, బుధవారం ఖమ్మంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు కూడా ఇలాంటి పొరపాటే చేశారు. టీడీపీ సీనియర్ నేత అయిన నామా ఇటీవలే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరారు. చేరిన రోజే ఆయన ఖమ్మం లోక్‌సభ టికెట్ సంపాదించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరిని ఎదురొడ్డనున్నారు.

ఈ క్రమంలో బుధవారం ఖమ్మంలో విస్తృత ప్రచారం నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా సైకిలు గుర్తుకే ఓటేసి గెలిపించాలని పలుమార్లు అభ్యర్థించారు. సైకిలు గుర్తుకే.. సైకిలు గుర్తుకే.. అంటూ పలుమార్లు అనడంతో ఆయనతో ఉన్న నేతలు నివ్వెరపోయారు. వెంటనే కల్పించుకుని ‘సైకిలు కాదు.. కారు’ అని గుర్తు చేయడంతో నామా తన పొరపాటును సరిదిద్దుకున్నారు. దీంతో నవ్వేసిన నామా.. కారు గుర్తుకే మన ఓటంటూ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. 

More Telugu News