Krishna District: పెనమలూరు టీడీపీ, వైసీపీ అభ్యర్థుల్లో దడ... టెన్షన్ పెడుతున్న నామినేషన్ల లోపాలు!

  • కేసుల వివరాలు వెల్లడించని అభ్యర్థులు
  • ఉన్నతాధికారులకు విషయం చెప్పిన రిటర్నింగ్ అధికారి
  • నేడు నిర్ణయం తీసుకుంటామన్న అధికారులు

కృష్ణా జిల్లా పెనమలూరులో ప్రధాన పార్టీల అభ్యర్థులు, ఈసీ నిబంధనల మేరకు నామినేషన్లు దాఖలు చేయడంలో విఫలం కాగా, వీరి నామినేషన్లను ఆమోదిస్తారా? తిరస్కరిస్తారా? అన్న ఉత్కంఠ నెలకొంది. ఇక్కడి నుంచి పోటీ పడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం అభ్యర్థులు తమపై ఉన్న పోలీసు కేసుల వివరాలను అఫిడవిట్ లో సమర్పించలేదు. దీంతో ఈ విషయాన్ని ఎన్నికల సంఘానికి నివేదించిన రిటర్నింగ్ అధికారి, పై నుంచి వచ్చే ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. తాజా పరిణామాలతో ఎవరి నామినేషన్ చెల్లుతుందో, ఎవరి నామినేషన్ ను తిరస్కరిస్తారో అన్న టెన్షన్ ప్రధాన పార్టీల అభ్యర్థుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. పెనమలూరు విషయమై నేడు తుది నిర్ణయం తీసుకుంటామని విజయవాడ సబ్ కలెక్టర్  వెల్లడించారు.

కాగా, కృష్ణా జిల్లాలో పెనమలూరు మినహా, మిగతా నియోజకవర్గాల్లో స్క్రూటినీ పూర్తయిందని అధికారులు తెలిపారు. మొత్తం 343 నామినేషన్లు దాఖలుకాగా, వాటిల్లో 94 నామినేషన్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కారణంగా తొలగించామని, 249 నామినేషన్లకు ఆమోదం పలికామని వెల్లడించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 28 మంది పోటీలో ఉండగా, మచిలీపట్నం నుంచి అత్యల్పంగా 9 మంది మాత్రమే బరిలో ఉన్నారు.

More Telugu News